- వినలేదా నువ్వు, కొమ్మలు వొంగుతాయి ఫల భారంతో -
అలా వొంగిన కొమ్మల కింద నువ్వు నిల్చున్నప్పుడు, ఎన్నో ఏళ్లుగా చెట్టు దాచుకున్న చెమ్మ నీపై బొట్లు బొట్లుగా రాలితే, నీ చెంపల్ని అరచేతితో తుడుచుకుంటావు: మరి చల్లగానో వేడిగానో
నీ అరచేతి ముద్రికల మధ్యకు చేరే కన్నీరో మరి నీ ఖండిత హృదయం నెత్తురో - అయినా తప్పదు: ఉదయం లేవాలి. నిన్ను నిర్ద్వందంగా ద్వేషించే మనుష్యుల మధ్యకు వెళ్ళాలి - కొంత నవ్వుతూనో, మరికొంత నమ్మకంతోనో - మళ్ళా వెన్నులో వాళ్ళనే దింపుకోవాలి. మరి ఒక నమ్మకంతోనో, ప్రేమతోనో: మొక్కల్ని నాటిన చేతులతోనే, వాళ్ళనే నిన్ను విరిచేసే వాళ్ళనే కౌగలించుకోవాలి,శరీరంలో పెంచుకోవాలి -
మృత్యు భారంతో వొంగుతున్న కాలం కింద, అప్పుడప్పుడూ కొంత గాలి. లతలు వొణుకుతాయి. ఇక ఒరిమిలేక, తాళలేక,నీపై పూవులు రాలి పడతాయి. పాదాల కింద మట్టి ఒక ఆకాశం. నువ్వు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఊబిగా మారే ఆకాశం. మబ్బులు కమ్ముకున్న కాలంలో, సంధ్యా సమయంలో, నీడలు సర్పాలై నిన్ను అల్లుకుని కాటు వేసే కాలంలో, ఇక్కడొక శబ్ధం - అక్కడొక శబ్ధం. శబ్ధాల మధ్య నిశ్శబ్దంలో తొణికిసలాడే సరస్సులోంచి నిన్ను పిలిచే చేతులు -
నిన్ను కన్నవారెవరో, నిన్ను పెంచినవారెవరో, నిన్ను వక్షోజాల మధ్య పొదివి పుచ్చుకుని నీ కన్నీళ్ళై తమకు తాము బ్రతుకు లేని వారెవరో నీ చుట్టూతా - నలు దిక్కుల నుంచి లక్ష గుసగుసలై, రహస్యాలై, నువ్వు ప్రేమించి నువ్వు ఉండలేని స్త్రీల కనులై, మసక మసకగా, అంతా ఆకస్మికంగా ఒక అంతిమ క్షణానికి చేరువైనట్టు -
ముఖం చూసుకుందామని తల వంచితే, అక్కడ అ గులక రాళ్ళని తాకి వెళ్ళే చిన్ని అలలలో మరెవరిదో ముఖం: నీ శరీరం, నీ ఆత్మా, నీ సమస్థం పూవు నుంచి విడివడిన రేకులై, పసుప పచ్చని ఆకులై, ఆ నీళ్ళల్లో, తీరం తెలియని దూరాలకు కొట్టుకుపోతున్న అనుభవం: ఆఖరిసారిగా, నిన్ను చూసుకుని, నీ అరచేతుల్లో పిచ్చుక పిల్లలా ఒదిగిన తమ అరచేతిని - ప్రాణం పోతున్నట్టు - అతి కష్టం మీద లాక్కుని, తన కళ్ళలోని నీరు నీ కంటబడకుండా చివాలున వెనుదిరిగి, తన్నుకు వచ్చే ఏడుపుని మునిపంట నొక్కిపట్టి పరిగెత్తుకు వెళ్ళిపోయిన అనుభూతి కూడానూ - మరి అక్కడ, ఆ సరస్సు అంతాన, వొంటరి మృగ చర్మాల వంటి
రాళ్ళపై నువ్వు కూర్చున్నప్పుడు, ఇక నీ ఎదురుగా నీ పాదాల వద్ద గత జన్మల సాక్షిగా మిగిలిపోయిన, కమిలిపోయిన, ఎండిపోయిన, తన పెదవి తెగి రాలిన నెత్తురు చుక్క, విశ్వమంత అశ్రుభారంతో - మరి నిజం చెప్పు
- చూడలేదా నువ్వు, ఫలాలని ఇచ్చి, తనకు తాను ఏమీ మిగుల్చుకోలేక, చివరికి చివికి, ఎండిపోయి, ముక్కలు ముక్కలుగా నరకబడి, ఆఖరుగా తగలబడిపోయిన ఒక చెట్టుని ఎన్నడూ?
(ఆహ్: ఇంతకూ ఏమిటీ ఇదంతా అంటావా? ఏమీ లేదు. సర్వం వలయమయ్యి తిరిగ వచ్చే వేళల్లో,దినానంతాన, ఒక పడవ తీరం వొదిలి వెళ్ళిపోతుంది. వెళ్ళలేక, అమావాస్య రాత్రుళ్ళకు వొణుకుతూ, ఒక తీరం అక్కడే ఎదురు చూపులతో మిగిలి పోతుంది.)
No comments:
Post a Comment