28 December 2013

గదులు

ఆగీ ఆగీ ఒక గాలి వీచి వెళ్ళిపోతుంది ఇక్కడ, నీలో నువ్వు నిమగ్నమయ్యి ఉన్నప్పుడు, ఎవరో భుజం తట్టి పలుకరించినట్టు, నీకు ప్రియమైన వాళ్ళెవరో ఎదురుపడి ఎలా ఉన్నావు అని ఆత్మీయంగా కౌగలించుకున్నట్టూ-

చూడు ఇటు.

కాంతి పచ్చిక పరకల్లా పరచుకున్న గదులు. వర్షానంతర నిశ్శబ్ధం పరచుకున్న గదులు. వర్షానంతర నిశ్శబ్ధంలోకి, ఆకుల అంచుల నుంచి చినుకులు రాలి సవ్వడి చేసే గదులు. పసి పాదాలు తిరుగాడిన గదులు. ఎంతో ఒరిమిగా ఎంతో ఇష్టంగా తను సర్దుకున్న గదులు. కాంతితో కడిగిన గదులు. తను ఇప్పటికీ కడగలేని, సర్దుకోలేని నేను నిండిన గదులు. గాలితో ఊపిరి పీల్చుకునే గదులు-

నువ్వు పడుకునే గదులు. నువ్వు రాసుకునే గదులు, నువ్వు ప్రేమించే గదులు. సన్నగా ఎవరో నవ్వినట్టు కూడా ఉండే గదులు. ఆగీ ఆగీ ఒక గాలి వీచి వెళ్లిపోయే, నిన్ను నీలోపల నుంచి వెలుపలకి తెచ్చే గదులు, చిన్న గదులు. నీ చిన్ని తల్లి వంటి, తన శరీరం వంటి గదులు.ముడతలు పడి, అప్పుడప్పుడూ సన్నగా కూడా కంపించే గదులు-

మనం పెంచుకున్న గదులు, మనం తెంపుకోలేని గదులు, మన వెంటే పిచ్చుక పిల్లలై ఇన్ని బియ్యం గింజలకై తిరుగాడే గదులు.అన్నం వాసన వేసే గదులు, తలారా స్నానం పోసుకుని, సాంభ్రాణి పొగలతో నీ చుట్టూ తిరిగే గదులు. నువ్వు బ్రతికి ఉండే గదులు.ఒక గాలి వీచి, నక్షత్రాలని లోపలకి తెచ్చి నీ ముందు కళ్ళాపి చల్లే గదులు. నువ్వు ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపని గదులు, ఇంతకు మునుపు నువ్వు ఎన్నడూ గమనించని గదులు -

మరి, అటువంటి గదులని చూసావా నువ్వు ఎన్నడైనా? 

No comments:

Post a Comment