కూర్చుంటావు నువ్వొక్కడివే, రాత్రి రావి చెట్ల
కింద: ఒ-క్క-డి-వే-
చీకటి చినుకులు ఒక్కొక్కటీ రాలి నిన్ను తడిపి ఒక గగుర్పాటుకు గురిచేస్తే, నీ ఒళ్లంతా జలదరించగా, జారుతుంది నీ కళ్ళలోకి ఒక సన్నటి వెన్నెల కిరణం: అశ్రువు వలే, తన రూపం వలే, తన ముఖం వలే, తన చేతివేళ్ళ అంచున ఉండే చెమ్మ వలే, తన పెదాల వాసన వలే, తన పలుకు వలే: అదే, తను నిన్ను పిలిచే - నీకూ తనకూ మాత్రమే తెలిసిన - నీ రహస్య నామం వలే, ఆ పిలుపుకు వేదనతో కంపించిపోయే నీ శరీరం వలే , చీకట్లను దాచుకున్న నీ అరచేతులలో క్రుంగిపోయే నీ దిగులు ముఖం వలే-
చూడు. ఎక్కడిదో ఒక దీపం:ఇక ఎవరో వెలిగించిన మట్టి ప్రమిదెయై,ఇక ఈ నీ జీవితం వెలుగుతుంది - రెపరెపలాడుతూ, గాలికీ స్మృతికీ ఊగిసలాడే నిప్పు అంచు వలే, ఈ చీకట్లలో, ఈ రాత్రుళ్ళలో ఈ రాళ్ళల్లో: ఇక అప్పుడు, వొంచిన నీ మెడను లేపి, కనుపాపాలని దాటి నీ కనురెప్పలను కమ్మిన వెన్నల బూజును అరచేతులతో మొరటుగా రుద్దుకుని, తొలగించుకుని, ఇంటికి వెడదామని, లేచి చూస్తావా నువ్వు
ఎదురుగా నీ మొండి పాదాలూ, మట్టిపై నలిగే ఎండిన ఆకుల సవ్వడీ
నల్లటి ఆకాశంలో స్థాణువైన చుక్కలూ, నీ చుట్టూతా అనంతానంతంగా
పరచుకున్న 'నువ్వు' అనే ఒంటరితనమూ, 'నువ్వు' అనే ఒక భీతీనూ-
మరి కనులను తుడుచుకున్న నీ అరచేతులలో తిరిగి ప్రత్యక్షమైయ్యే తన ముఖంతో మాటతో ఈ రాత్రి రావి చెట్లనూ, చీకటి సరస్సులనూ దాటి, ఒక గూటికి, ఒక నీడ చెంతకూ, ఒక
వెలుతురు కురిసే చోటకీ ఎప్పుడు, ఎలా, ఎన్నటికి చేరుకోగలవు నువ్వు-?
వెలుతురు కురిసే చోటకీ ఎప్పుడు, ఎలా, ఎన్నటికి చేరుకోగలవు నువ్వు-?
No comments:
Post a Comment