25 January 2014

స్పష్టత

స్పష్టమైన కారణం ఏమీ కనపడలేదు ఇంకా: కానీ, నువ్వు
నా వైపు చూసినప్పుడు
నీ చుట్టూతా ముసిరిన
నీడలు-

'నీ కళ్ళు అప్పుడు, రహదారిని దాటేందుకు అటూ ఇటూ
కంగారుగా తిరిగే, తల్లి లేని
వీధి కుక్కపిల్లల బెదురు నయనాలు'
అని నేను అనుకుంటాను
కానీ

బరువు తగ్గిన నీ శరీరంలో నేను చూడలేని నొప్పీ, ఒక వాన హోరు-
చీకట్లలో ఎక్కడో, చెట్లు
తెగిపడుతున్న చప్పుడు
అప్పుడు

నీ అరచేతులలో
అంతం లేని
రాత్రుళ్ళు-

నీ హృదయమే నిన్ను ఒక క్రూర మృగమై వెంటాడితే, వేటాడితే
నీ ఎదురుగా నెత్తురు కక్కుకునే
నిర్మానుష్యపు దారులు
శోకనివారణ లేని
గృహాలూ
ఇళ్ళూ-

నిజమే. స్పష్టమైన కారణం ఏదీ కనిపించలేదు. నిన్ను హత్తుకునే
మనిషే, ఇంకా ఎక్కడా
దొరకలేదు-
ఇక్కడ, ఇంకా

ఒక మనిషి మరొక మనిషికి అంకితమయ్యే సహనమే, ఎవరికీ
అలవడలేదు. ఎవరికీ
మిగలలేదు -

ఇక, నిన్ను నువ్వే అడుగు లేని ఒక బావిగా మార్చుకుని
నిన్ను నువ్వే తోడుకుని
ఆ నీళ్ళల్లో

నిన్ను నువ్వు చూసుకుంటూ
గుక్క గుక్కగా
నిన్ను నువ్వు
త్రాగుకుంటూ
బ్రతకడమే

ఇక్కడ, చివరికి అందరకీ మిగిలిన జీవన విధానమనీ, అంతిమమనీ
ఎవరూ చెప్పలేదా
నీకు

ఓ వెన్నెలా? 

No comments:

Post a Comment