13 January 2014

ఇక ఇప్పటికి

1
నిశ్చలమైన సరస్సులో నువ్వు నీ ముఖాన్ని చూసుకుంటున్నప్పుడు
ఎవరో తటాలున అరచేతితో నీళ్ళని కదపగా
నీ ముఖం అవతలి ఒడ్డు వరకూ తేలిపోయినట్టు
ఒక అలజడి: నీ లోపల- ఒక రహస్య ప్రదేశంలో-
2
గోడలపై ఊగే లతలు. నీ చుట్టూతా గాలి
నీ లోపల పేరుకుని, క్రమక్రమంగా పెరిగే
మంచు కంటే, నీ కళ్ళల్లో వీచే పొగమంచు కంటే చల్లనైనదేమీ కాదు-
ఒక చేయి వడలిన పూవై నీ మెడ చుట్టూ

రాలిపడుతుంది అప్పుడు: అది నువ్వు
తన/నే అలసట అని అన్నా
నాకేమీ అభ్యంతరం లేదు-
3
"కొద్దిగా  తోడు ఉండు నాకు. అప్పుడప్పుడూ చాలా బెంగగా ఉంటుంది-
ఒంట్లో బావోలేదు. నాప్కిన్స్  తెచ్చుకోడానికీ
ఓపిక లేదు. బ్లీడింగ్ ఎక్కువుగా ఉంది-"అని

తను ముడుచుకుపోతే, అప్పుడు నువ్వొక
నిస్సహాయుడివి. నేలపై వ్యాపించే రాత్రివి
అంత నొప్పిలోనూ ఉదయం తను కడిగిన
ఇంట్లో, తన శరీరం వాసన. ఎలెక్ట్రిక్ కుకర్లో

ఉడుకుతున్న అన్నం వాసన. తెరచిన బాల్కనీ తలుపులోంచి చీకటి వాసన-
"ఎక్కడికీ వెళ్ళకు. ఇంటి పట్టునే ఉండు-"
అని తను అంటే, పిల్లలు అయోమయంతో
చూస్తారు, వేసుకుంటున్న బొమ్మల్ని ఆపి-

"నాన్నా, బయటకి వెళ్తున్నావా?" అని అడుగుతో-
4
ఒక ముఖం వలయాలుగా విస్తరించి, ఒడ్డును తాకి
తిరిగి లుప్తం అయ్యింది. జీవితం ఒక  అద్దం-
జీవితం ఒక ద్రవ్య దర్పణం.కేంద్రకం తనైన
దర్పణాన్ని ప్రతిబింబించే దర్పణం. చూస్తే
5
ఏముంది ఇక్కడ? ఒక చిన్న అద్దె ఇల్లు - రెండు మంచాలూ, కొన్ని పుస్తకాలూ
పిల్లలు ఆడుకునే వస్తువులూ, మాటలూ-
వంట వండుకునే ఇన్ని పాత్రలూ, ఒక
మట్టి కుండా, నాలుగైదు కుండీలూ...
6
కడుపు నొప్పికి మాత్రలూ, వాలుతున్న
తన కనురెప్పల కింద చలించే అరణ్యాలూ
నుదిటిపై తెరలుగా వీచే పురాస్మృతులూ...

అరచేతిలో తను నీ అరచేతిని గట్టిగా పట్టుకుని పడుకుంటే, ఒదిగిపోతే
పసిపాపెవరో గుప్పిట్లో నీ చేతివేలిని, గట్టిగా
బిగించి పట్టుకున్నట్టూ,ఒక మహాజ్వరంలో
బాల్యాన్ని నీ తల్లి కలవరిస్తున్నట్టూ,నువ్వు

ఆ కళ్ళ కింది సరస్సులలో నీ ముఖాన్నీ, నీ సమస్త జీవితాన్నీ చూసుకుంటున్నప్పుడు

7
చదువరీ, ఇక ఇప్పటికి ఇదే జీవితం, ఇదే కవిత్వం- నువ్వే చెప్పు

ఇక ఇంతకు మించి, వీటన్నిటినీ దాటి
మిగిలేది ఏమిటి?నీకూ నాకూ-మనకూ? 

1 comment: