1
నిన్న రాత్రి నువ్విచ్చిన పూలగుచ్చం ఇక్కడ
ఒక ప్లాస్టిక్ బాటిల్లో, నీళ్ళల్లో -
అవే, వాడిపోని ఈ పూవులు
కొన్నిసార్లు అవి నీ కళ్ళు. కొన్నిసార్లు అవి నీ మాటలు.
కొన్నిసార్లు, అవి నీ చుట్టూ తిరిగే
పిల్లలు. వాళ్ళ ఆటలూ. నిదురలో
తెరుచుకున్న వాళ్ళ పెదవులు. ఇంకా మరి
వాళ్ళ నుంచి వచ్చే వాసనా
అర తెరచిన వాళ్ళ చేతుల్లో
చిక్కుకున్న, నీ చేతివేళ్ళూ -
2
గంజి పెట్టి ఉతికిన దుప్పటిలోంచి ఎప్పటిదో
బాల్యంలో అమ్మ బొజ్జను
చుట్టుకున్న ఒక స్మృతి
నేలపై, చాపపై ఆ ఇంట్లో-
నువ్వు కూడా ఇప్పుడు
దవనం వాసన వేస్తావు-
అదే, కనకాంబరం పూలను అల్లుకున్న, మెరిసే దవనం-
ఇక, నవ్వే నీ ముఖంలో, నన్ను
చుట్టుకునే నీ చేతుల్లో
ఒక పసిపిల్లతనం, ఇష్టం-
3
బహుశా జన్మదినాలూ, జన్మించడమూ ఇంతేనేమో -
పూల నీడల్లో కాంతి రేఖలు. గూళ్ళల్లో
ముడుచుకున్న పిట్టలూ -
వీచే గాలికి చలించే ఆకులూ
చీకటిలో మెరిసే నక్షత్రాలూ
ఛాతిపై సీతాకోకచిలుకలు ఏవో వాలినట్టు ఉన్న
పిల్లల చేతులని ఆప్తంగా తాకి
ఎప్పటికీ ఇక్కడ ఉండబోమనే
ఒక స్పృహ జ్ఞప్తికి రావడమూ
కావొచ్చును. కొంత దయతో
మేల్కొవడమూ అవ్వొచ్చును-
4
వెళ్ళిపోతాం నువ్వూ, నేను- ఎప్పటికైనా - చివరికి -
మరో పక్కకి ఒత్తిగిల్లిన తరువాత
పక్కపై నలిగిన ఖాళీలో మిగిలిన
నీ శరీర స్పర్శ ఏదో నునువెచ్చగా
తగిలినట్టూ, ఒక లాంతరై రాత్రంతా
మనకు కలలలోకి దారి చూపినట్టూ
వనాలలో కురిసే తుంపర వంటి నిశ్శబ్ధం: ఇప్పుడు ఇక్కడ-
ఇక, నిశ్శబ్ధం నీవైన ఆ క్షణంలో
ఈ కవితను ముగించడం ఎలా?
No comments:
Post a Comment