చెట్టు మొదట్లో వాలిపోయిన పసి ఆకు ఉన్నటుండీ చలించి,వొణికిపోతుంది-
చూడూ,ఇది నిజం:
పూలతో ఖండింపబడ్డ, ఖడ్గక్షణాలు ఇవి-
ఎగరలేదు. కొమ్మల్లో రెక్కలు విదిల్చే
పక్షిని చూడలేదు. ఎగరాలేదు -
చీకటి వంటి దట్టమైన నీడల్ని కప్పుకుని
దాని కింద మూలిగే ఈ లేత ఆకు
మా మాటల్ని వినలేదు, తన తల్లి
కళ్ళలోని నీటిని తాకనూ లేదు -
వడలిపోయిన, పిగిలిపోయిన, కమిలిపోయిన
ఒక చిన్న శరీరం ఈ ఆకుది
ఆ అమ్మదీ, ఆ నాన్నదీ
ఈ చిన్ని అద్దె ఇంటిదీనూ -
ఏం లేదు: అరచేతుల మధ్య దీపం ఆరకుండా
రెండు అరచేతులై కూర్చున్న
ఆ ఇద్దరి పరీక్షా దినమే ఇది-
చూడూ,ఇది నిజం:
పూలతో ఖండింపబడ్డ, ఖడ్గక్షణాలు ఇవి-
ఇక ఏం చేయగలం
నువ్వూ, నేనూ-?
No comments:
Post a Comment