10 September 2013

ఒక మధ్యాహ్నం

ఇలా రాస్తాను ముందుగా: ఈ మధ్యాహ్నం,రెపరెపలాడే ఒక తెలుపు వస్త్రం -

నువ్వు పరాకుగా ఒంటరిగా సంచరిస్తున్నప్పుడు, నీ ఇంటి పెరట్లోనో
     రద్దీ వీధులలోనో ఒక హస్తం నిన్ను తాకి వెళ్లి పోతుంది.అప్పుడే ఉతికి
ఆరవేసిన వస్త్రం గాలికి కదిలి ఇంత తడిని నీ ముఖాన చిమ్మినట్టు-
   
మరి అప్పుడు ఉలిక్కిపడి చూస్తావు, నీ లోకాల లోంచి బయటకు వచ్చి
     ఆకుపచ్చని చెట్ల కింది నీడలనీ,ఎక్కడో కూసే పక్షులనీ,ప్రవహించే గాలినీ-
ఎవరో అలికినట్టు ఉన్న ప్రపంచాన్నీ, కారణం ఏమీ లేకుండా నవ్వుతున్న
   
పసిపిల్లల వంటి మనుషులనీ,పూవుల్లా విచ్చుకునే వాళ్ళ మాటలనీ. మరి
   
ఇంతకాలమూ ఇంత కాంతీ ఇంత శాంతీ ఎందుకు కనపడలేదా అని నువ్వు 
     అబ్బురపడుతుంటే, మబ్బులు చుట్టుకుంటున్న ఆకాశం కింద
తీగలపైనుంచి దుస్తులను తొలగిస్తూ ఆ అమ్మాయి అంటుంది కదా
 
"గాలికి ఆగడం లేదు ఆ తెల్లటి దుప్పటి - కాస్త తొలగించి లోపలి తీసుకు వద్దూ-"
      అని. మరే:ఇక నువ్వు చక్కగా మధ్యాహ్నాన్ని మడత పెట్టి,బుద్ధిగా
తన వెనుకగా లోపలి వెడతావు ఇలా వ్రాసుకుంటో:

- ఈ మధ్యాహ్నం -రెపరెపలాడని ఒక తెలుపు వస్త్రం కింద ఒదిగిన-ఒకమ్మాయీ 
     ఇంకా నిండైన తన శరీర దీపమూనూ. ఇక బయట పడటం ఎలా 
ఇక్కడ నుంచి? ఈ వాన లోకాలలోంచీ, తన పరిమళ కాలాలలోంచీ? 
               ఈ ఎర్రని మబ్బులలోంచీ? 

No comments:

Post a Comment