16 February 2012

విన్నపం

అలసిపోయిన చేతులని
హత్తుకోమని అడగలేను

వడలిపోయిన కనులని
ఎదురుచూడమని చెప్పలేను

అక్కడో, ఇక్కడో, ఎక్కడో

తప్పిపోయిన హృదయాన్ని
దారి చూపించమని
ప్రార్ధించలేను, మోకరిల్లలేను

ఉన్నావా అని అడగలేను
ఉంటావా అని అర్ధించలేను

ఈ రాయీ, ఈ శిల్పం
ఈ కాగితం ఈ పదం

మసకబారి మత్తిల్లిన
ఆ రాత్రుళ్ళలో తప్ప

ఎన్నడూ నిన్నది ప్రేమగా
పిలవడం నేర్వలేదు.
ఎన్నడూ నీకది బ్రతికిలేదు

ఎన్నడూ నిన్ను అది
కనీసం బ్రతికించలేదు

వెన్నెల కురిసే కళ్ళలో రక్తం
పెదాలపై నిరంతర మౌనం
ప్రతిష్టించాడమే దాని ధర్మం-

చర్మం నిండిన మర గదులలో
ఈ లోహపు రహదారుల్లో
నువ్వు దాచుకున్నదేమీ లేదు
నేను పొందినదేమీ లేదు. యిక

రాలిపోయిన జాజి పూలనూ
స్వర్గలోకవనాలనూ, పాపం
రెక్కలు తెగిన పిచ్చుకలనూ
చూసిందెవరూ, అడిగిందెరూ

అమాంతం గాట్టిగా కావలించుకుని
మరణం భయపడేటట్టు
ముద్దు పెట్టుకునేదెవరూ?

1 comment:

  1. baagundi kavita. goppa lines and images... I like it :)

    ReplyDelete