ఎలా ఉండింది
నిరుడు కురిసిన ఆ వర్షం?
పచ్చగానా? ఎర్రగానా?
వెచ్చగానా? చల్లగానా?
నలుపుగానా?
తెలుపుగానా?
మాయ చేసే మోహంగానా?
కామంగానా?
ప్రేమగా నా?
ఏమీ తెలియని మహా దాహంగానా?
నిండైన కోరికగానా?
మహా ద్వేషంగానా?
అన్నీ తెలిసిన రెండు శరీరాల్లానా?
ఎలా ఉండింది
ఇద్దరినీ ముంచివేసిన
నిరుడు కురిసిన వర్షం?
దయగా నా?
దుక్కంగానా?
ఇప్పటికీ ఉలిక్కిపడి లేచే
చెమట పట్టిన రాత్రుళ్ళలానా?
వొణుకులానా?
విరహంలానా?
ఏడ్చి ఉబికిన కనీళ్ళలానా?
రక్తం లానా?
శోకం లానా?
తెగిన మణికట్టుతో మింగిన
నిద్రమాత్రలలానా?
పిల్లల లానా?
పిట్టల లానా?
రాకుండా వెళ్ళిపోయిన
గర్భస్రావపు పూవులానా?
ఎలా ఉండింది ఆ వర్షం
నినూ నన్నూ
ముంచి వేసిన, నిరుడు
కురిసిన ఆ వర్షం?-
యవ్వనం లానా?
వృద్ధాప్యం లానా?
మత్తులోకీ, చావులోకీ ముంచే
తియ్యటి విషంలానా?
పదంలానా? ఆ
కల కలలానా?
కలైన పదంలానా
పదమైన కలలానా
నిదురులోని గుసగుసలలానా?
వీడ్కోలులానా
దూరాం లానా
ఎన్నటికీ తాకలేని చేయిలానా?
బ్రతకలేని నీ జీవితంలానా
జీవించలేని మరణంలానా
ఖాళీ బాహువులలానా
ఖాళీ చూపులలానా
ఒంటరి దీపంలానా చీకటి గదిలానా మదిలానా
ఎండిన పూలపాత్రలానా
వడలిన రోజాలానా మార్చని దుప్పట్లలానా
వేయని వెల్తురులానా కదలని తెరల లానా
వెలసిపోతున్న దినంలానా
ఆ దిగులు సాయంత్రంలానా
నువ్వు చెప్పలేక కోల్పోయిన
ఒక మహా ఇష్టంలానా, ప్రియమైన మనిషిలానా
ఎలా ఉండింది
నిరుడు కురిసి వెళ్ళిపోయిన
యిక ఎప్పటికీ రాని ఆ వర్షం?
Kaliaina Madhu patrala vundi...nirudu kurisina aa neeli varsham..!
ReplyDelete