03 February 2012

నీ ఇష్టం

ఒక చిన్న పాత్ర
తనంత, తన తనువంత చిన్న పాత్ర

పూలు ఉంచుకుంటావో నీళ్ళు జల్లుకుంటావో
నీ ముఖాన్ని ముంచుకుంటావో ఇక నీ ఇష్టం

గోడకి అభిముఖంగా అద్దంలో
ఒక చందమామ వెలుగుతోంది:

తన కురులను సర్ధుకుని దువ్వుకుని
గదిని ముంచివేసిన వాటి చీకట్లలో
తన నుదుటన ఒక కాంతి రేఖను

వలయంగా దిద్దుతోంది: తన కనులతో
అద్దం కళ్ళలో గూళ్ళను అల్లుతోంది

పెదవిని మునిపంట నొక్కిపెట్టి
అద్దంలోంచి నిన్ను చూసి నవ్వుతోంది
ఆగి ఆగి జల్లుజల్లుగా రాలిపడుతోంది

చలించే చిన్న పవిత్ర పాత్రే తను
అలలై కదిలే చిరుగాలే తను
మరపు లేని తన తనువే తను:

ఉంచుకుంటావో, దాచుకుంటావో
పగలగొట్టి చేజార్చుకుంటావో ఇక నీ ఇష్టం-

1 comment: