29 February 2012

నైరాశ్యం 1

నలుపుని అద్దుకుని తిరగాలి ఇక్కడ
గాలి వెళ్ళిపోయే కళ్ళతో దూరంలోకి

యిక నవ్వుతూ నువ్విచ్చే ఒక మాట
వలయామృత విషం

తెరలలో దాగి తెరలలోనే ఎదిగి
తెరలలోనే వెనుదిరిగే నీ పసిడి ముఖం

నలుపు
తెలుపు
తెలుపు
నలుపు

నన్ను బ్రతికించే నీ తెల్లని వాక్యమేదీ
నా కన్నీళ్ళలో బ్రతికి లేదు యిక్కడ

ఒక చిన్న మొక్క ఊగుతోంది గాలితో
పొటమరించే చిగురాకు పరవశంతో
ఒక చిన్ని చుబుకం ఎదురు చూస్తోంది
నీడలు తెచ్చే చినుకుల మొహంతో

పెదవుల వంటి రెండు అరచేతులు
హిమసుమాల వంటి బాహువులు
ఆప్తంగా అతి ప్రియంగా అనేకంగా
నిశ్శబ్దాన్ని మీటే మిగులు నిశ్శబ్దాలు

అంతా అదంతా ఒక స్మృతి విస్మృతీ
అంతా అదంతా ఒక గానం గాయం

అంతా తెలుపు నలుపు
అంతా నలుపు తెలుపు

సంధ్యవేళల్లో నారింజ ఎండలో
ఎవరో తమ శ్వాస మునివేళ్ళతో
నిన్ను నిర్ధయగా తవ్వే
మైమరపు
గగుర్పాటు-

ఏం చేయగలవ్ యిక నువ్వు
ఏం పొందగలవ్ యిక నువ్వు

నలుపు తెలుపు
తెలుపు నలుపు
నల్లని తెలుపు
తెల్లని నలుపు

నీచే తెంపబడి, వడలిన పూలను
హత్తుకుని తిరిగే దేహద్రిమ్మరివై

యిక ఎంత శోకించీ ఏం లాభం?
యిక ఎంత స్థుతించీ ఏం........?

కళ్ళు వెళ్ళిపోయే దూరంలో
గాలి వెళ్ళిపోయే ఆ కాలంలో
యిక నీ ఒంటికి పూచిన నిద్ర మాత్రలన్నీ తనవే!

No comments:

Post a Comment