10 February 2012

నా గదిలో

ఇక్కడేమీ లేదు నీకై నా గదిలో

రెండు రాళ్ళు, రెండు కళ్ళు
ఆ నీడలలో దాగిన
రెండు పావురాళ్ళు

రెండు చేతులు రెండు కాళ్ళు
అలా ఎగిరే పచ్చని
సీతాకోకచిలుకలు

నీ కోసం తపనగా వెదుకుతూ
నీ వరకూ సాగే రెండు పెదాలు

గోడపై పగిలిన ఎండ రెండుగా
పూసిన పూలు నిండుగా
రెండుగా, రెండు పదాలుగా-

ఇక్కడేమీ ఉంచలేదు నీకోసం
నేను నా గదిలో-

ఒక కూజాలో రెండైన ఆ ముఖం తప్ప
ఒక అద్దంలో రెండైన చూపులు తప్ప
రెండు చూపులలో నాలుగు విధాలుగా
పగిలిన, మిగిలిన నువ్వు తప్ప

రెండుగా మిగిలిన నేను తప్ప
రెండుగా చిట్లిన మరణం తప్ప

ఇక్కడ ఏమీ దాచుకోలేదు నాకై
నేను నా గదిలో-

ఇంతకూ ఎటువంటి హస్తాలతో
హత్తుకున్నావు నువ్వు నన్ను

వ్యామోహంతో ప్రేమతో ద్వేషంతో

నీ నవ్వు మెరిసే బాకుతో
నువ్వు నన్ను దయగా పొడిచిననాడు?

2 comments: