08 February 2012

ఆ ప్రదేశం

ఒకోసారి ఆ పిలుపు నిన్ను పిలుస్తుంది

అద్దంలోంచి ఒక చేయి
నిన్ను అంధుడిని చేసినట్టు
కలలో ఒక మెత్తటి ముఖం
నిన్ను నమిలి తిన్నట్టు

నోటి వద్ద నీటి పాత్రలోంచి
నీలి సర్పాలు ఎగిసినట్టు
రాత్రిలో ఏవో అ/ శరీరాలు
నీ గొంతు నులిమినట్టు

నీ కళ్ళను పెకిలించి ఎవరో
నీకే నీకై ఆప్తంగా ఇచ్చినట్టు
నీ పక్కగా కూర్చుని ఎవరో
నిన్ను తాపిగా కొస్తున్నట్టు

దాహంతో ఉలిక్కిపడి లేచిన
పెదాలకు ఎవరో ప్రేమగా
కాలకూట విషం తాపిస్తున్నట్టు

ఎవరో ప్రేమగా నిన్ను
చెరిపివేస్తున్నట్టు
చిదిమివేస్తున్నట్టు
చంపివేస్తున్నట్టూ

ఒక్కోసారి ఆ సమ్మోహనమైన పిలుపే నిన్ను
నవ్వుతో లాక్కువెడుతుంది
ఆ తలారుల తోటల్లోకి, రంగుల్లోకి-

యిక ఎవరొచ్చారు తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి
కొట్టుకునే గుండెతో, హత్తుకునే బాహువులతో?

1 comment: