04 February 2012

ఏం చేస్తావు?

ఇదొక పచ్చిక మైదానం కాదు
అలా అని వెన్నెల గూళ్ళు కట్టుకునే పూలవనమూ కాదు

రెండు బుజ్జి కుక్కపిల్లలు
లోహపు దారులపై, యంత్రపు హృదయాలపై

ఒకదాని వెనుక మరొకటి, గిరగిరా గిరగిరా గిరగిరా గిరగిరా
నీ చుట్టూతా నీ వెనుకా పరిగెడతాయి

పాల పొదుగుల కళ్ళు, లేతగా నవ్వే చెక్కిళ్ళు

లేత ఎరుపు నాలికలతో రాత్రి గాలిని తాగుతో
అవి తల్లి లేని ఆ బుజ్జి కుక్కపిల్లలు

ఒకదానితో మరొకటి, నీతోనే ఒకటి నీతోనే ఆ మరొకటి
నీ వెనుకే నీ చుట్టూతా గిరగిరా గిరగిరా గిరగిరా గిరగిరా
చెంగున ఎగురుతో అపై, తటాలున నిన్ను నాకుతో
రివ్వున తోకల్ని ఊపుతో మహదానందంతో గెంతుతో

తెల్లని నల్లని తెలనల్లని నలతెల్లని నల్ల తెల్ల ఊదాతనంతో
నీలోకీ నువ్వు వెళ్ళలేని నింగి లోకాలలోకీ కాలాలోకీ అవే

నీ భాష వొదిలివేసిన ప్రేమతో, జీవంతో కదులుతో
ఈ విశ్వపు సజీవ శ్వాస కాంతితో సాగుతో
కాంతి చైతన్యంతో మెదులుతో అవే మరి నీతో నాతో మరి అవే-

మరి ఏం చేస్తావు నువ్వు, మరి ఏం చేయగలవు నువ్వు
రాత్రి నీతో కదిలి, నిన్ను నీ చదరపు గదుల
శీతల నిర్ధయ కాంతి భవంతుల వద్ద వొదిలి

నీచే కసురుకోబడి, నీచే విసిరివేయబడి, నీచే చరచబడి

ఉదయానికల్లా దారిపై చెల్లాచెదురై, పేగులు చిట్లి రక్తం ఓడిన
నీ వెనుకాలే, నీ చుట్టూతా గిరగిరా గిరగిరా పూవుల్లా ఎగిరిన

తల్లి లేని ఆ బుజ్జి కుక్కపిల్లల్ని
తండ్రి లేని ఆ బుజ్జి వీధి పిల్లల్ని

ఇప్పటికీ నీ వెనుకాలే వచ్చే, నువ్వే సర్వం అనుకున్న
నీ పిల్లనీ నీ పాపల్నీ అనాధల్నీ

ఈ మహా రాక్షస అనాధ దేశాన్నీ
ఈ అత్యాధునిక మహారాక్షస ఇనుప తెరల మనుషులని?

No comments:

Post a Comment