07 February 2012

లేదు దారి

అరచేతులతో దాచుకున్న ముఖం కాదిది
కాగితాలతో కప్పుకున్న సమాధి

తెరలతో లోకం ఏమీ మారలేదు, నువ్వేమీ తెరిపి పడలేదు

తెంపుకున్న పూలు, రాసుకున్న పదాలూ
హత్తుకున్న చేతులూ, కమ్ముకున్న చీకట్లూ
కన్నీళ్ళతో ఉడికే కళ్ళూ, ఆ మెత్తటి తనువూ

దాచుకోడానికి ఏమున్నాయి యిక్కడ
ఇంతకు మించీ? ఇంతకు మినహా?

చూడెలా ఇకిలింతలతో మెరుస్తుందో నీ పాప
నీ అనుమతి హద్దులను దాటి
ఎందుకో దాచుకున్న నీ ముఖాన్ని తాకి!

నీలోని నువ్వే నీకు ఒక పెద్ద అడ్డు
నీకు నువ్వే ఒక మహా కనికట్టు- ఎన్ని నాలికలు నీ శరీరంనిండా!

ఇపుడే అరిచింది హృదయంలోని నల్ల కాకి
అతిధులు వచ్చేందుకూ నువ్వు అద్దంలోంచి అడుగిడేందుకూ
యిదే సరైన మహామాయా సమయం: వెళ్ళు. వెళ్లి తెంపుకురా

వెన్నెలలో రహస్యంగా విచ్చుకునే
పాపాల పూలను పరమ పవిత్రంగా
ఎందుకంటే

ఒక ఖడ్గంతో, క్షమతో కూడిన ఒక విషపు చిర్నవ్వుతో
తను అనంతంగా నీకై ఆ గడప వద్ద
గులక పదాలతో ఎదురుచూస్తోంది-

2 comments: