03 November 2017

అతిధి

కొంత ఆలస్యం అయ్యింది; మరి అది నేను రావడమో, నువ్వు రావడమో; అయినా ఊహించాను; కిటికీలు తెరచి ఉండవచ్చునని, రాత్రి ఒక పూలతోటై లోపలికి వీస్తుండవచ్చుననీ, అది నీ శ్వాసై ఉండవచ్చుననీ! *** ఎవరు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలుసు, సిద్ధంగా ఉండటానికి? ఎవరికైనా ఎలా తెలుసు, ఎవరు నీ హృదయ ద్వారాన్ని మునివేళ్ళతో నెమ్మదిగా తడతారో, ఇక చలించి తలుపులు తెరుచుకోగా, ఆ గాలి ఉధృతమై, వానతో నీ లోనికి జొరబడి నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసి వొదిలివేస్తుందనీ? పూలు రాలి చెదిరిన నేలవై నువ్వు, స్థాణువై మిగిలి పోతావనీ? కొమ్మలు అన్నీ తడిచి, చినుకు చినుకై రాలే ఒకానొక శబ్దంగా నువ్వు ఆగిపోతావనీ? ఏ చీకట్లోనో, వొణికే ఒక పద్యమై ఇంకిపోతావనీ? ఎదురుచూసే ఒక తల్లై నీ హృదయం తల్లడిల్లుతుందనీ? *** రావడం కొంత ఆలస్యమయ్యింది; మరి అది నేనో, లేక నువ్వో; తారస పడటం కూడా ఆలస్యం అయ్యింది; నాకు నువ్వో, నీకు నేనో! ఎంత నొప్పి ఇది? ఎదురెదురుగా ఉండి, తాకాలనీ తాకలేక, ఉండాలనీ ఉండలేక ... *** సిద్ధంగా లేనప్పుడే లోపలికి వచ్చి, నిన్ను కుదిపివేసేదే మరి జీవితమనీ, అదే నువ్వనీ, ఒక పూలకత్తితో లోలోపలికి చెక్కుకుపోయి, గాయమూ, శాంతినీ ఇచ్చే ఓ బహుమతి నీవనీ, కాల స్పృహవనీ, జనన రహస్యానివీ మృత్యు పరిమళానివీ నీవని - మరి ఎందుకు తెలిసి రాలేదు నాకు ఇన్నాళ్ళూ?

No comments:

Post a Comment