01 November 2017

తర్జుమా

కిటికీ ఆవలగా పిచ్చుకలు; కనిపించవు, కానీ
చివ్చివ్ చివ్చివ్మంటో ఎందుకో
ఒకటే అరుపులు; మసక మధ్యాహ్నపు వేళ, 
వృక్షఛాయలో, ఒక నీటి పాయ
రాళ్ళని ఒరుసుకుంటో అట్లా పారుతోన్నట్లు,
ఎందుకు? ఆ ధ్వనులు? ఏం చెప్తోన్నాయవి?
వొట్టి శబ్దాలేనా అవి? ఆకులు
రాలి, గాలికి నేలపై కొట్టుకుపోతోన్నట్టు, వాన
సన్నగా కురుస్తోన్నట్టు, మరి,
అంతేనా? ఇంకే అర్థమూ లేదా, ఆ శబ్దాల్లో?
బయట వెలుతురు; నీ చర్మమై మెరుస్తోంది!
కిటికీ ఆవలగా నిశ్శబ్దం, కాంతి
కూడా కొలవలేని చీకటియై, జోలపాటలేని
ఖాళీ ఊయలయై, ఊచల మధ్య
అరచేతుల్లో పాతుకుపోయిన శిరస్సయ్యితే,
***
కిటికీ ఆవలగా, ఏవో ఎగిరిపోయి, మిగిల్చిన
ఖాళీ గూళ్ళు. మట్టి దీపాలు -
శ్వాస లేని పూలు. ఎన్నెన్నో అలిఖితాలు!
మరి తెలుసునా నాకు? ఇప్పటికైనా? నువ్వు
చేరాకనే, శబ్దం అర్థంగా, ఒక
హృదయంగా మారి, ఈ లోకం చలిస్తోందనీ?

No comments:

Post a Comment