28 March 2014

అతడు 2

అతడు ఏకాకిగా అతడిపై అతడికున్న పగతో సర్వాన్నీ వదులుకునేందుకు తాగుతున్నప్పుడు
ఆకస్మికంగా
దు:ఖించే పగలు నక్షత్రాలతో మెరిసిపోయే దయాపూరితమైన రాత్రిగా మారుతుంది.
ఆకస్మికంగా
దయాపూరితమైన రాత్రి మళ్ళా ఉదయాన్నే
చినుకుల గులాబీలతో ఆటలాడే
మెత్తటి సూర్యరశ్మిగా మారుతుంది.

అప్పటికే అతడి పక్కగా సుదూర ద్వీపాల్లా మారిన స్త్రీలు, మళ్ళా తిరిగిరాని సమయాలలోకి
సారించిన చూపులతో కూర్చుని ఉంటారు-
అప్పటికే అతడి పక్కగా ప్రియురాళ్ళ కంటే
సన్నిహితమైన స్నేహితులు, ఇక తిరిగి రాని సమయాలలోకి కోల్పోయిన
తమ అమ్మలనీ నాన్నలనీ చూస్తూ ఉంటారు.

అతడు ఏకాకిగా అతడిపై అతడికున్న ప్రేమతో, సర్వాన్నీ పొందేందుకు తాగుతున్నప్పుడు

ఆకస్మికంగా
గాయాలతో విలవిలలాడే మధ్యాహ్నం ఓదార్చే గాలిగా మారుతుంది.
ఆకస్మికంగా
రాబోయే సాయంత్రం తల్లి ఒదిలి వెళ్ళిన స్పర్సలా మారుతుంది.

అతడు ఏకాకిగా, అతడిపై అతడికి ఉన్న ఏమీలేనితనంతో, అతడిని అతడు చేరుకునేందుకు
అంతిమంగా తాగుతున్నప్పుడు

అతడి అస్తిత్వాన్ని నిశ్శబ్దంగా చుట్టుకునే, రాలిపోతున్న నక్షత్రం చుట్టూ
వలయాలు వలయాలుగా పరుచుకునే
మృత్యుకాంతి మాత్రం మిగులుతుంది-

No comments:

Post a Comment