ఒక నల్లటి హృదయం గురించి మీకు చెబుతాను
నల్లటి నలుపు నలుపై తెల్లగా మారిన హృదయం:
మృత శిశువువంటి, వేకువ మంచువంటి
ఆగిపోయిన ఆ తల్లి కన్నీటివంటి తెల్లటి హృదయం:
అతనెప్పుడూ ఇలా లేడు:
వర్షం కురిసే రోజులలో గడ్డిలోనూ, గెంతే పిల్లలతోనూ
వర్షం కురియని రోజులలో దాహార్తులతోనూ
వెన్నెల విరిసిన రాత్రుళ్ళలో రక్తం చిందించే స్త్రీలతోనూ
గర్భస్రావాల అశ్రువులతోనూ
చీకటి ముసిరిన రాత్రుళ్ళలో
వెన్నెలను రాజేస్తున్న స్నేహితులతోనూ శత్రువులతోనూ
ఎవరూ లేని కాలాలలో తనతో తానుగా
ఇన్ని పదాలను పుచ్చుకుని
బావిలోని చందమామను తోడుతూ
అతడు ఆనందంగానే ఉన్నాడు
అతడి హృదయం పచ్చగా, బలమైన గాలికి జలజలా పొర్లే
రావి ఆకుల సవ్వడిలా, సాయం సమయాన
మిమ్మల్ని చిరునవ్వుతో తాకిన మీకు నచ్చిన వదనంలా
అతడి హృదయం మిలమిలలాడుతూనే ఉండింది
అతడు ఉన్నాడు ఆ కాలాలలో: అతడు అతడికీ
అందరికీ బ్రతికే ఉన్నాడు ఆ కాలాలలో: అన్నీ మిశ్రమమై
కలిసే వసంత సమయాలలో
అతడు ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు.
అతడు ఖచ్చితంగా ప్రేమించే ఉన్నాడు.
కలలు నలుపు కాక మునుపు, ఆ వదనం అస్థిత్వపు
దీపపు కాంతిలో దాగిన నల్లటి చారిక కాక మునుపు
పదాలకు మునుపూ,పదాలకు తరువాతా కదులాడే నల్లటి
విశ్వవలయంలోకి జారక మునుపు
శరీరం స్వయంప్రకాశితమై, జ్వలనమై దిగంతాలలోంచి జారే
ఒక నలుపు జలపాతం కాక మునుపు
అతడు ఖచ్చితంగా హృదయం కలిగే ఉన్నాడు
అతడు ఖచ్చితంగా కదులుతూనే ఉన్నాడు. అటువంటి అతడు
ఒక నల్లటి హృదయమై, నల్లనవ్వడంలో హృదయం లేనివాడై
నలుపు నలుపై, మృతనయన మంచు తెమ్మరుల తెలుపై
శిధిలాలపై గడ్డ కట్టిన నీటి చుక్కై, సమాధుల మధ్య
సమాధులలో తిరిగే నల్లటి రాత్రై, మృతులతో
మృత్యువాహక క్షణాలతో
గూడు లేక, దేశం లేక, దేహం లేక పదం లేక
ఇతర పద్మం లేక, నలుపు రెక్కలతో తెల్లటి కళ్ళతో
ఎక్కడికి ఎగిరిపోయాడో మీకు ఏమైనా తెలుసా?
No comments:
Post a Comment