25 April 2011

నా వద్దకు రాకు

నా వద్దకు రాకు

ఉన్నాయి నా వద్ద రెండు పదునైన బాకులు:
అవి నీ హృదయం, నా పదాలు=

ఏమైనా చేయవచ్చును నేను

నిన్ను ఒక అద్దంగా మార్చి నన్ను
నేను చూసుకోవచ్చును
నిన్ను ఒక సరస్సుగా మార్చి నేను
ఒక నల్ల చేపపిల్లనై
అందులో తిరుగాడవచ్చును
నిన్నొక బంగారు రంగు చేపపిల్లని చేసి
నేనొక వలతో సిద్ధంగా
ఉంది ఉండవచ్చును

ఏమైనా చేయవచ్చును నేను

నిన్నొక ఉద్యానవనంగా మార్చి
నేనొక తోటమాలినై తిరుగాడతుండవచ్చు
నిన్నొక సీతాకోకచిలుకగా మార్చి
నేనొక బాలుడినై
నీ రెక్కలని విరిచి పట్టుకునేందుకు
ఎదురుచూస్తుండవచ్చు
నిన్నొక తెల్లటి కాగితం చేసి
వంకర టింకర గీతాలతో, రంగులతో
నిన్ను చిత్రిస్తుండవచ్చు
ఆపై నిన్ను ముక్కలు ముక్కలుగా
చించివేస్తుండవచ్చు
నిన్నొక కాగితపు పడవని
చేస్తుండవచ్చు
నీది కాని వర్షపు నీటిలో నిన్ను
వదిలివేస్తుండవచ్చు
కుదుపులతో
కురిసే వర్షపు చినుకులతో
ఎలాగోలాగ సాగుతున్న నిన్ను
పాదాలతో తొక్కివేస్తుండవచ్చు

నీపై పూలు రాలుస్తుండవచ్చు
నీ ఒడిలో పుడమి
పున్నమై మెరుస్తుండవచ్చు
వెన్నలని చుట్టుకున్న నిన్ను
చీకటితో నింపి
నీ రక్తాన్ని చిందిస్తుండవచ్చు

ఏమైనా చేయవచ్చు నేను

నా వద్ద రెండు పదునైన
బాకులు ఉన్నాయి కనుక
అవి నీ హృదయం
నీ ప్రేమా అయ్యాయి కనుక

ఏమైనా చేస్తుండవచ్చు నేను


రాకు నా వద్దకు=

1 comment: