అస్థిత్వపు అంచున
కొన ఊపిరితో, ఆఖరి చూపులతో
ఎల్లప్పుడూ
నిన్ను అంటిపెట్టుకునే ఒక స్త్రీ ఉంటుంది
అస్థిత్వపు అంచున
మరణానికి ముందు, జననానికి ముందు
ఎల్లప్పుడూ తుడిచివేయబడే
నిన్ను అంటిపెట్టుకునే
అతడి ప్రస్థుత వర్తమానం ఉంటుంది
అస్థిత్వపు అంచున
భూమి మొదటి స్పర్శలో
మెరుస్తోన్న మొదటి మంచు బిందువులు
కనిపించని చిగురాకులను
చీల్చక మునుపునుంచీ
ఎల్లప్పుడూ
నిన్ను అంటిపెట్టుకునే ఒక తపనా,
దిగులూ మొదలయ్యాయి
అస్తిత్వపు అంచున
మరో పరిమళ సమయపు శకలంలోకి
వీడుకోలు చెబుతూ వెడలిపోతున్న
పురుషుడి విషాద సముద్రపు తీరాలను
తాకాలని తపించే
మరొక పురుషుడి నయనమూ ఉంటుంది
అస్థిత్వపు అంచునే
ఒక పిల్లవాడి కళ్ళ నుంచి
రక్తం అనాదిగా స్రవిస్తోంది
అస్థిత్వపు అంచునే
ఉగ్గపట్టుకున్న పెదాల మధ్యనుంచి
ఒక ఆక్రందన
అనంత విశ్వంలోకి ఎగిసిపోతుంది
అస్థిత్వపు అంచునే
ఒక ప్రార్ధన ఒక ఉనికి ముందు
మోకాళ్ళపై ఒరిగిపోయి
ఇక ఎప్పటికీ ప్రేమింపబడలేని
ఇక ఎప్పటికీ తాకలేని
అతడి జీవితపు, ఆమె జీవితపు
జ్ఞాపకపు సమాధి ముందు
ఒక దీపమై వెలుగుతుంది
అస్థిత్వపు అంచునే
రేపటి కనిపించని
వినిపించని వెక్కిళ్ళు
రేపటి ఉన్మాదపు
నిదురరహిత రాత్రుళ్ళూ
రేపటి ఇప్పటిదాకా వినని
కోరికల ఖగోళాలూ, ఒక ఉనికిని
అసంక్యాఖంగా తుంపులు చేసే
ఖడ్గాలూ, నువ్వూ నేనూ అన్నీ
ఒక అస్థిత్వపు అంచునే.
No comments:
Post a Comment