నెమ్మది నెమ్మదిగా
ఇంత దూరం వచ్చాం మనం
నెమ్మది నెమ్మదిగా
ఇంత దూరం జరిగిపోయం మనం
నెమ్మది నెమ్మదిగా
ఈ ఎడబాటు కళను
నేర్చుకున్నాం మనం
ఎవరికీ తెలీదు
ఎవరికీ ఇంతకాలం తెలీదు
ఎవరికీ ఇంతవరకూ తెలీదు
ఎలా బ్రతికి ఉన్నామో మనం
ఎలా జీవించామో మనం
విరిగిన సమయాలలోంచీ
ఇపటికీ స్మృతితో పచ్చిగా ఉన్న
గాయాలలోంచీ,
మనం తరువాత మన పిల్లలకి
చెప్పుకునే
అవమానానలోంచి
ఎవరికీ తెలీదు
ఎవరికీ ఇంతకాలం తెలీదు
ఎవరికీ ఇంతవరకూ తెలీదు
ఎలా మనం
ఒక గూటిని నిర్మించుకునేందుకు
సంవత్సరాల తరబడి
రక్తంతో మట్టిని తరలించామో
ఎలా మనం
ఒక వంతెనని నిర్మించుకునేందుకు
శరీరాల్ని శిలువ వేసుకున్నామో
ఎలా మనం
ఒకర్నొకరు చూసుకునేందుకూ
ఒకర్నొకరు పొదివిపుచ్చుకునేందుకూ
తరచూ
మనల్ని కలిపి ఉంచే ఒక పదాన్ని
సృష్టించకునేందుకు తపించిపోయామో
ఎవరికీ ఇంతకాలం తెలీదు
ఎవరికీ ఇంతవరకూ తెలీదు
నువ్వు అక్కడే ఉన్నావు
ఆమే అక్కడే ఉంది, అరచేతిని అరచేతితో
పెనవేసుకుని
మనవైపూ, మనల్ని నింపివేసే
రాత్రుళ్ళవైపూ, చీకటి వైపూ
సూర్యరశ్మివైపూ, మంచువైపూ వర్షంవైపూ
చూసే పిల్లలూ అక్కడే ఉన్నారు
ఎవరికీ తెలీదు
ఎవరికీ ఇంతకాలం తెలీదు
ఎవరికీ ఇంతవరకూ తెలీదు
ఎలా మనం
దినం తరువాత దినం
రాత్రి తరువాత రాత్రి
క్షణం తరువాత క్షణం
చనిపోతూ జీవించామో.
ఇక ఇప్పుడు, ఒక ఇప్పుడు మాత్రమే
మళ్ళా మనం తిరిగి మొదలు పెట్టి
అందరికీ చెప్పవచ్చు
ఎలా మనం
నెమ్మది నెమ్మదిగా
ఇంత దగ్గరకు వచ్చామో
ఎలా మనం
నెమ్మది నెమ్మదిగా
ఇంత దగ్గరిగా జరిగామో
ఎలా మనం
నెమ్మది నెమ్మదిగా
ఈ ఒకటిగా ఉండే కళను
నేర్చుకున్నమో.
ఇక మనం
ఇక, ఇప్పటికి
నిశబ్దాన్ని తనని తాను మాట్లాడనిద్దాం.
డియర్ శ్రీకాంత్:
ReplyDeleteనీ కవిత్వం చదువుతున్నా క్రమం తప్పక.
నువ్విలా కనిపించడం బాగుంది. ఇక నీ కవిత్వంలో వస్తున్న మార్పుల్ని చూడడమూ బాగుంది.
కవిత్వంలో నీ సంగతులూ, నీ కదలికలూ తెలుస్తున్నాయి.
మన మిత్రులందరికీ ఇది సంతోషకరమయిన హలాయి బలాయి కావాలని కోరుకుంటున్నా.