మనల్ని దయగా పొదివిపుచ్చుకునే ఆ సమూహమే
తిరిగి మనల్ని నిర్దయగా వేటాడుతుంది
నీ ఇంటి వెనుక పెరట్లో నువ్వొక చిన్ని మొక్కను నాటి
నీ వేదనని తుడిపివేసే, నీ అస్తిత్వపు వేదనని
తేలిక తేలికగా తుడిపివేసే ఆ మొక్కకు పూచే
ఒకే ఒక్క పూవుకై ఎదురు చూస్తావు
నువ్వు దానికై ప్రతిరోజూ వర్షాన్నీ, గాలినీ ఎండనీ
కొన్ని పదాలనీ తీసుకువెళ్లావు.
నువ్వు దాని వద్దకు, నీ వద్దకూ ఒక అరణ్యాన్నీ
నీడనీ కాంతినీ తీసుకువెళ్ళావు:
శీతాకాలపు రాత్రుళ్ళలో, అది ఒంటరిగా
అనుభూతి చెందినప్పుడు, నువ్వు ఒంటరిగా అనుభూతి
చెందినప్పుడూ,నువ్వు దానివద్దకు
నీ వద్దకూ ఆమె చేతుల గోరువెచ్చదనాన్నీ
ఆమె కళ్ళలోని కరుణనీ, ఆమె వక్షోజాల తల్లితనాన్నీ
తీసుకువెళ్లావు. ఎందుకంటే, నువ్వు
మరి కొంతకాలం జీవించి ఉండి,సంధ్యా
కాంతిలో కానీ చంద్రకాంతిలో కానీ పుష్పించే ఆ ఒకే
ఒక్క రహస్యపుష్పానికై నువ్వు
ఎదురుచూస్తూ ఉండగలవని.
నువ్వు దాని వద్దకు నీ పిల్లలను తీసుకువెళ్లావు. వాళ్ళు
దానితో ఆడుకునేందుకు
ఏమీ ఆశించకుండా ఎదురుచూడటాన్ని నేర్చుకునేందుకు
జీవించడంలోని వేదనని తెలుసుకునేందుకూ
నువ్వు దాని వద్దకు నీ పిల్లలను తీసుకువెళ్లావు. నెమ్మది
నెమ్మదిగా, నువ్వు
దాని సాన్నిహిత్యంలోకి నీ తల్లితండ్రులను తీసుకువెళ్ళావు.
ఎందుకంటే వాళ్ళు దానిని మరొకసారి
తమ అలసిన వృద్ధాప్యపు అరచేతులలో పొదివిపుచ్చుకుని
ప్రేమ ఉందనీ, తాము ఒకప్పుడు
సముద్రాలపై తాత్కాలికంగా ఎదురుపడి మరణించేంత గాడతతో
ప్రేమించీ రమించే ప్రయాణికుల్లా ఉండేవారమనీ
జ్ఞాపకం చేసుకునేందుకు, నెమ్మది నెమ్మదిగా నువ్వు దాని
సాన్నిహిత్యంలోకి నీ తల్లితండ్రులను తీసుకువెళ్ళావు.
మరణం ప్రేమంత శక్తివంతమైనదని తెలిపేందుకు నువ్వు
దాని వద్దకు సమస్థ మానవాళిని తీసుకువెళ్లావు
మొహసింతో, నీ రక్తంతో వాళ్ళ రక్తంతో, యుగాల ఆమె
ఎదురుచూపులతో ఆమె త్యాగంతో
నువ్వు దానిని పోషించావు. ప్రతి దినం ప్రతి క్షణం నువ్వొక ప్రార్ధనతో
దానిని పోషించావు. నీ వేదనతో
గాలిలో సంతకం చేసి నువ్వు దానికై నువ్వు నీకై ఎదురుచూసావు.
మొహసింతో, మన కోసం ప్రేమగా ఎదురుచూసే ఆ సమూహమే
మనకోసం తపించే ఆ సమూహమే
మనల్ని నిర్దాక్షిణ్యంగా వేటాడుతుంది
నీ జీవితాన్ని త్రుణపాయంగా ధారపోసిన ఆ ఒక్క పూవు, ఆ ఒకే ఒక్క
నీ రహస్య అస్తిత్వపు పూవు
మొహసింతో, ఆ ఒకే ఒక్క పూవు ఎక్కడకు వెళ్ళింది?
No comments:
Post a Comment