ఎంతగా అలసిపోయిన సమయాలివి
ఆఖరకు ఉచ్చరించే ఒక పదం కూడా
రోదించే ఒక పాపలా మారిపోయే
ఎంతగా అలసిపోయిన సమయాలివి?
నేను నీ వద్దకు వచ్చాను, అరచేతులనిండా
పూలతో, రాత్రి కాంతితో చెమ్మగిల్లిన
నక్షత్రాలతో నేను నీ వద్దకు వచ్చాను.
నేను నీ వద్దకు వచ్చాను, ఎడారులనుండీ
శిధిలాల మధ్య నుండీ
విరిగిన శిలా విగ్రహాలు తమ పాదాల చెంత
విలపించే తమ నీడల్ని
నిస్సహాయంగా చూసే ప్రదేశాలనుండీ
ఒక సుదీర్ఘమైన ప్రయాణం తరువాత, నేను
నీ వద్దకూ, ఈ జీవితం వద్దకూ
జీవించి ఉన్న
మృతువు వద్దకూ వచ్చినప్పుడు
నువ్వు అడుగుతావు:
"అలసిపోయినది సమయమూ, పదమా
లేక మనమా?"
సరిగ్గా అప్పుడే, ఖాళీ చేతులు
అలసిన సమయాలను
పరామర్సిస్తున్నప్పుడే
నేను గ్రహిస్తాను: నీ అరచేతులు
ముళ్ళ పక్షులతోనూ
శిధిలాలతోనూ
ఒక విరిగిన అద్దంలో వెదజల్లబడిన
రాత్రితోనూ
నిండి ఉన్నాయని. ఇక ఆ తరువాత
ఒక నీడ మోకాళ్ళపై ఒరిగిపోయి
ఈ పదాలను ఒక
ప్రతీకకూ, ఒక రక్తపు బిందువులో
చెక్కబడిన వెన్నెలవంటి
వదనానికీ అంకితం ఇస్తుంది.
ఇక ఆ తరువాత
జీవించేది ఎవరు? మరణించేది ఎవరు?
అస్తిత్వపు అంచున దాగుని
తనని తాను ఎవరికీ చెందని
ఒక గులాబీకి సమర్పించుకునేది ఎవరు?
No comments:
Post a Comment