31 August 2010

మరొక అసహనం

నీ అసహనానికి కారణం లేదు
నువ్వు కావాలనుకున్నప్పుడు మేఘాలు వర్షించవు
నువ్వు కావాలనుకున్నప్పుడు
జాబిలి తన బంగారు చిరునవ్వుతో, సముద్రాలనీ
అరణ్యాలనీ ముంచివేసేందుకు బయటకు రాదు

నీ నిశ్శబ్దానికి ఒక కారణం ఉన్నట్టయితే
నీ పిలుపుకై ఇంటి చుట్టూతా తిరుగాడే పిల్లులు అలా
ఒక మూలకు ముడుచుకుని పడుకుని ఉండవు
నీ కారణానికి కనుక కారణాలు ఉన్నట్టయితే
చిన్ని వర్షంలాంటి చిన్ని చిరునవ్వునుతో తిరుగాడే
ఆ స్త్రీ అలా మరణించకపోయి ఉండును
నీ నిర్లక్ష్యానికి కనుక కారణం ఉన్నట్టయితే
ఇంటి వెనుక లిల్లీ పూలతో
కప్పలతో చలించే తోట అలా మరొక రుతువులోకి
మరొక అవిటి వేసవిలోకి వెళ్ళిపోకపోయి ఉండును

ఎందుకంటే
నీ జుత్తుతో దంతాలతో నిండిన చీకటి గదిలోకి
నీ నఖాలూ వక్షోజాలూ నిండిన చీకటి సాయంత్రంలోకి
నీ శ్వాసా పరిమళం నిండిన చీకటి చందమామలోకి
రాలిపడుతూ నేను

నా నాలిక శిలువ వేయబడి రక్తంతో స్రవిస్తుండగా, నేను
నా ఎముకలను లెక్కపెట్టుకుంటూ ఉండి ఉండను
కన్ను పై కన్నుతో
దూరం పై దూరంతో
నేను నీ ఆత్మహత్యకీ
నా హత్యకీ సిద్ధం అవుతూ ఉండి ఉండను.

No comments:

Post a Comment