15 August 2010

సూజన్ నువ్వు నిదురిస్తావు

సూజన్, నువ్వు నిదురిస్తావు, ఒక అనాధ పదంలా
ఏదో చూశానన్న స్పృహ తప్ప
ఎం చూసానో తెలియని, కలలో కాంచి
నిదుర లేచిన తరువాత మరచిపోయి, చివరకు
హృదయంలో మిగిలినపోయిన ఒక పదునైన నొప్పిలా
సూజన్ నువ్వు నిదురిస్తావు.

సూజన్ నువ్వు నిదురిస్తావు, నేను ఎన్నటికీ చేరుకోలేని
సముద్రానికి ఆవలివైపుకి నీ తలను మరల్చి
సూజన్ నువ్వు నిదురిస్తావు. నువ్వు అక్కడ విశ్రమిస్తావు
అద్దాల గదిలో చిక్కుకున్న ప్రతీకలా, అవ్యక్త భయంలా
నువ్వు అక్కడ విశ్రమిస్తావు.

నిశ్సబ్ధపు పదాలతో నేను నిన్ను తాకేందుకు ప్రయత్నిస్తాను.
నా దేహపు ఎముకల పడవతో
నేను నీతో ప్రయానించేందుకు ప్రయత్నిస్తాను.

సూజన్ నువ్వు నిదురిస్తావు, నేను ఎన్నటికీ కొలవలేని
శూన్యానికి ఆవలివైపుకి తలను మరల్చి
సూజన్ నువ్వు నిదురిస్తావు. నువ్వు అక్కడ విశ్రమిస్తావు
భాషాగృహం లో కోల్పోయిన ప్రతీకలా, అవ్యక్త జలదరింపులా
నువ్వు అక్కడ విశ్రమిస్తావు.

పదాల ఖాళీ ప్రతిధ్వనులతోటి నేను నిన్ను చంపేందుకు
ప్రయత్నిస్తాను. ఇక ఇక్కడ ఏమాత్రంలేని
ఎవరికీ చెందని ఒక జ్ఞాపకపు కాంతిలో నేను నిన్ను
పునరుజ్జీవింపజేసేందుకు ప్రయత్నిస్తాను.

సూజన్ నువ్వు నిదురిస్తావు, నేను ఎన్నటికీ అందుకోలేని
కలకు ఆవలివైపుకి ముఖాన్ని మరల్చి
సూజన్, నువ్వు నిదురిస్తావు. నువ్వు అక్కడ విశ్రమిస్తావు
తపన గృహంలో కోల్పోయిన శబ్దంలా, స్వరం లేని అద్బుతంలా
నువ్వు అక్కడ విశ్రమిస్తావు.

సూజన్, నువ్వు నిదురిస్తావు, ఊపిరి పోసుకుంటున్న ఒక పదంలా
ఏదో చూశానన్న స్పృహ తప్ప
ఎం చూసానో తెలియని, కలలో కాంచి మరచిపోయి
నిదుర లేచిన తరువాత
హృదయంలో మిగిలినపోయిన ఒక పదునైన కాంతి తరంగంలా
సూజన్ నువ్వు నిదురిస్తావు.

1 comment:

  1. పదునైన నొప్పి/ జ్ఞాపకపు కాంతి/కోల్పోయిన శబ్ద0 లా0టి మ0చి పద ప్రయోగాలు చదివి చాన్నాళ్ళయి0ది. మీకు ధన్యవాదాలు

    ReplyDelete