ఆఖరి నక్షత్రాల చివరి కాంతీ, మొదటి ఉదయపు తొలి వెలుగు బ్రాంతీ
రాత్రి స్త్రీని గమనిస్తున్న నా గదిలోకి కొట్టుకువస్తాయి
(సూర్యరశ్మిని పొదివి పట్టుకున్న వర్షపు చినుకులతో
దినాలని అల్లిన సమయాలలోకి
ఇంతకు మునుపు నేను జీవించి ఉన్న సమయాలలోకి
మళ్ళా నేనెప్పటికైనా చేరుకోగలనా?)
ఈ చిక్కటి చెట్లలోకి మరో ప్రపంచంనుంచి దూసుకువచ్చిన సవ్వడి
ఆ నల్లటి పక్షులని అలజడిగా లేపుతుంది
ఆ ప్రేమా రాహిత్యపు పరుషుడు తన 'ఉన్న, లేని' స్త్రీతో
తనని ఒక్కసారి పొదివి పట్టుకొమ్మని ప్రార్దిస్తుండగా
గాలిసర్పం నా కళ్ళని కాటు వేస్తుంది
(ఇంతకు మునుపు నేను జీవించిన సమయాలలోకి
మళ్ళా నేను ఎప్పటికైనా చేరుకోగలనా
భూమి నుంచి ఆకాశం దాక ఊయల లూగిన క్షనాలలోకి
మళ్ళా నేను ఎప్పటికైనా చేరుకోగలనా?)
ఉదయంవేళ గుమ్మం ముందు అ తల్లి పాప జుత్తుని దువ్వుతుంది
మధ్యాహ్నంవేళ గుమ్మం ముందు ఆ పాప వొంటరిగా
తల్లి లేని ఇంటిలో విరిగిన అద్దంలో ముక్కలైన తన ముఖాన్ని చూసుకుంటుంది
రాత్రివేళ గుమ్మంకావలగా, గుమ్మం ఇవతలగా
ఏ దీపమూలేని ఇంట్లో తల్లీ పాపా చీకట్లో కంపిస్తూ ఒకరినొకరు పొదివి పట్టుకుంటారు
(ఇంతకు మునుపు నేను కలలుగన్న సమయాలలోకి
మళ్ళా నేను ఎప్పటికైనా చేరుకోగలనా
ఇంతకు మునుపు నేను మరణించిన సమయాలలోకి
మళ్ళా నేను ఎప్పటికైనా చేరుకోగలనా?)
No comments:
Post a Comment