10 August 2010

మృత్యుపుష్పపు రాత్రి

వేకువజూము మంచు, రాత్రి అద్దంపై మిగిలిన రక్తపు మరకలని తుడుస్తున్నప్పుడు
నేను నా నాభిని తింటున్న నీ మృత్యుపుష్పపు రేకుల్ని లెక్కపెడతాను.

ఇక తగలబడుతున్న ఈ శీతాకాలపు సమయాన్ని వెచ్చబరుచుకునేందుకు, మూడు
మేఘాల రాళ్ళ మధ్య సూర్యుడ్ని పోగేసి చితుకుల మంట పెడుతున్నప్పుడు
ఒక స్త్రీ అతడి చంకల వాసన రుచి చూసేందుకు మొదటి రాత్రి మంచం పైనుంచి లేస్తుంది.
ఆమె చుబుకమూ, వక్షోజాలూ ఆమె మోకాళ్ళ వెన్నెలపై వాలుతుండగా
ఆమె చూపులు అతడి మర్మావయపు కృష్ణపక్షపు పక్షిని అబ్బురంగా చూస్తాయి.
ఇక ఆమె తన దంతాలతో, సమయపు నత్తై, మైమరపు నిద్దురయ్యీ
అతడి నాభివద్ద నుంచి మూసిన తలుపుల కిందుగా వెలుపలికి
ప్రవహిస్తున్న ఇద్దరి వీర్యపు కలలతో, బయటకి తెరిచిన ప్రపంచంలోకి,
అనంతంలోకీ ఎగిరిపోతుంది. ఇక నేను

వేకువజాము నలుపు మంచు, అర తెరిచిన ఆమె పాలిపోయిన పెదాలపై ఒలికిన
రక్తపు మరకలని నాలికతో తుడిపివేస్తుండగా,
పుక్కిళించబడ్డ నా నిద్రలో వలయాలుగా తిరుగుతున్న నీ మృత్యుపుష్పపు
ఊపిరాడని రేకుల్ని లెక్కపెడతాను.

3 comments:

  1. బీభత్సం అంచుల మీద సమతూకం కుదరని నడక. శ్రీకాంత్! పరమావధి బీభత్సమేనా? తెలిసీ జవాబు చెప్పకపోయావో....! :)

    ReplyDelete