ఈ దినం
నీటి పాదాల వెంట సాగిపోయే
దిశారహితంగా తేలిపోయే
ఎండిపోయిన ఆకు కింద కదులాడే నీడలా
అరణ్యాల నిశ్శబ్దాలలోకి రాలిపడుతుంది
ఈ దినం
అనామకమైన ఆకాశం కింద
భూమిని తన వెంట
మానవుల బలిశాల వద్దకూ
పవిత్ర మందిరాల వద్దకూ
మోసుకువెళ్ళే
గొంగళిపురుగు పాదాల మధ్య
ఇరుక్కుపోయిన
సూర్యరశ్మిని కాంచి, ఆకస్మికంగా
కనిపించని కొమ్మల
మధ్యనుంచి అరిచే
ఒక పక్షి నిస్సహాయతతో
రాలిపడుతుంది
ఈ దినం
ఒక్క దినం మాత్రమే
పిగిలి పోగలిగినట్టు
పిగిలిపోతుంది కూడా: ఉన్మాదమైన
కొయ్య గర్బాల్లా మారిన
నా కళ్ళలో
ఈ దినం ధూళిలా మారి
దేహం మైనంలా మారి
పుస్తకాల అరల మధ్య దాగున్న
శిధిలాల్లా మారి
నెమ్మదిగా సర్వమూ
రెక్కలులేని
పురుగుల్లా మారి
ఈ దినం
నక్షత్రాల నిశ్శబ్దాలలోకి రాలిపడుతుంది.
No comments:
Post a Comment