జీవితం ఉండటం జీవించేందుకు కారణం కాదు. పాపాలకై వెదుకుతూ అతడు
రాతి కాళ్ళ దేవుళ్ళనీ, మానభంగాలనీ, కోయబడ్డ వక్షోజాలని మాత్రమే కనుగొంటాడు
(అతడి అరచేతులు ఇక ఎవరూ లేక
ఆకాశానికి మోరేత్తిన మృగాల్లా మారతాయి
అతడి అరిపాదాలు ఇక ఎవరూ లేక
రిక్త నయనాలతో తిరిగే అనాధ పిల్లల్లా మారతాయి)
ప్రేమ ఉండటం ప్రేమించేందుకు కారణం కాదు
కలలకి వెదుకుతూ అతడు నిర్లిప్త కాళ్ళ స్త్రీలనూ, గర్బస్రావాలనూ, దారి పక్కన వొదిలివేయబడ్డ
శిశువులను మాత్రమే కనుగొంటాడు
(రూపరహిత స్త్రీ పక్కగా కూర్చుని అతడు
మరణించే నక్షత్రాలను మధువులోకి ఆహ్వానిస్తాడు
జన్మిస్తున్న పగటిపూటను అతడు, రాత్రిని
పూర్తిగా తడిపిన పిల్లవాడి మూత్రంతో గమనిస్తాడు)
ప్రేమా, జీవితం, మృత్యువు ఉండటం కవిత వ్రాసేందుకు కారణం కాదు
కవితను వ్రాస్తూ అతడు వాక్యం చివర ఆడుకునే పాపను చూస్తాడు. పాప కలల అంచున
మృత్యు జాడలుగా మారుతున్న శబ్దాలనూ, అర్థాలనూ గమనిస్తాడు. నీకు తెలుసు,
ఆమెకూ తెలుసు: ప్రతిదీ ఇలాగే మొదలవుతుంది
ప్రతిదీ ఇలాగే అంతమవుతుంది: అతిత్వపు దు:ఖాన్ని భరించలేని ఒక మహా మూలుగుతో:
అయితే
(ఇక ఈ వాచకాన్ని దగ్ధం చేసేందుకు
గతంలో కొంత ఖాళీని ఉండనివ్వండి.)
No comments:
Post a Comment