పగలంతా రోదించే పదాలు ఉంటాయి. తనని దాటుకుంటూ చూడకుండా తప్పుకుంటూ వెళ్ళే మనుషుల్ని మలం వేలాడుతున్న దుస్తులతో చందమామవలె, సముద్రంపై కదులాడే చీకటి అలలవలె, ఇకిలింతలతో, కళ్ళ నిండా నీళ్ళతో, తిండికి బ్రతిమిలాడుకునే భిక్షగత్తెతో పగలంతా
ప్రయాణించే పదాలు ఉంటాయి
పదాలుంటాయి. అస్తిత్వపు అంచున ఆగిపోయే విరామ చిహ్నాలుంటాయి. పగలు పాలిపోయిన మధ్యాన్నంవైపు కదులుతున్నప్పుడు ప్రజలు ప్రార్ధనా గీతాలవలె అలసి ఇళ్ళకు చేరుతున్నప్పుడు ముఖంపై జారే నీటి బిందువుల్లాంటి పదాలు ఉంటాయి -
పదాలుంటాయి. ఎప్పటికీ సరిపోని పదాలు ఉంటాయి. ఎప్పటికీ అంతం కాని పదాలు ఉంటాయి
No comments:
Post a Comment