ఈ పాటను ఇంతకుమునుపే విన్నావు నీవు-
భూమి పొరలలో ప్రవహించే నీటి రక్తపు చలనాన్ని
ఆకస్మికంగా నీ ఉనికితో విన్నట్టు
ఈ పాటను ఇంతకు మునుపే విన్నావు నీవు
విశ్వాలకు మునుపు, లోయలోకి జారుతున్న ఆకులా
నీ అస్తిత్వం నిర్భయంగా
వినీలాకాశంలో స్వేచ్చగా కదులాడే పక్షి రెక్కలపైన
ఊయలలూగుతున్నప్పుడు
నీ లోపలి పాతను విభ్రమంతో విన్నావు నీవు-
వర్షం కురిసే రోజులలో, నీడ కమ్మిన మధ్యాహ్నాలలో
మొహంతో నిన్ను పిలిచినా నక్ష్తాలను
నవ్వుతూ తాకిన వేళలలో, ఎవరూ లేని రాత్రుళ్ళలో
నీ లోపలి పాటని వింటూ పాటగా మారావు నీవు
నీ లోపలి పాటని వింటూ నీవుగా మారావు నీవు
అది
నిశ్శబ్దాలకి నిశ్శబ్దం
పాటలకి పాట మాటలకి మాట
నా వైపు చూడు
ఈ శబ్దరహితపు పాటను ఇంతకు మునుపు విన్నావు నీవు.
No comments:
Post a Comment