11 August 2010

కృతజ్ఞతలు

అప్పుడే నీళ్ళు చిలకరింపబడిన మొక్కల ఊపిరికి రాత్రి పరదా కదులుతుండగా,
అప్పుడే వెలిగించబడిన వీధి దీపాల చేతులు
రాబోయే జాబిలికి నీడల శాలువా అల్లుతుండగా, అర మూసిన కళ్ళతో నక్షత్రాలు
సముద్రపు ఒడ్డున వోదిలివేసిన సూర్యుడి పాదముద్రల్ని
ఇంటి వెనుక అలసట నిండిన ఎదురుచూపుల కళ్ళతో పాత్రలని
తోముతున్న స్త్రీ తుడిపివేయడాన్ని గమనిస్తుండగా

అతడు ఇంట్లోకి అడుగు పెడతాడు. ఉదయమంతా తనతో మోసుకు తిరిగిన ఆకలితో
ఇప్పుడు గదిని నింపుతున్న
తన శరీరపు చమట వాసనతో సాక్సుల దుర్గంధంతో
తన వైపు నెమ్మదిగా కదులుతూ వస్తున్న సర్పాన్ని గమనించి, తన గూటిలోనే
ఇరుక్కుపోయి విలవిలలాడుతున్న పక్షిలాంటి కోరికతో అతడు ఇంట్లోకి అడుగుపెడతాడు.

నత్తలా మంచంవైపు సాగి, మంచంలో సమాధి అయ్యి మరణించిన వాళ్ళందరిని
వాళ్ళు తిరిగి రానందుకు ప్రార్ధిస్తూ కృతజ్ఞతలు
తెలియ చేస్తాడు. తన తల్లి ఇంట్లో ఉన్న బల్లులకూ కోళ్ళకూ కుక్కలకూ ఆహారం
వండుతుండగా, తన వృద్ధాప్యంలో కుత్తుక తెగిన బర్రెలా
మూడు కాళ్ల గార్ధబంలా తిరుగాడిన తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాడు.
జిరాఫీలా ఉన్న గుడ్లగూబలాంటి మనిషితో పెళ్ళయిన తన చెల్లెలనీ,
ఇప్పటికీ ఇంటి వెనుక ఇంట్లో మరెక్కడో ఉన్న బల్లులకూ
కోళ్ళకూ కుక్కలకూ ఆహారం వండేందుకు అంట్లు తోముతున్న తన భార్యనీ
గుర్తుచేసుకుంటాడు. అలా గుర్తుచేసుకుంటుండగా, రెండు తలుపుల మధ్య,
రెండు గులాబి ముళ్ళపొదల మధ్య ఇరుక్కుపోయి, ఇంకా జీవంతో చలిస్తున్నఅతడి కోరిక
అతడికి ఒక మూలకు కూర్చుని స్కూలు పుస్తకాల ఖాళీ గోడలని చూస్తున్న
తన పిల్లల స్కూలు ఫీజుల్ని గుర్తుచేస్తాయి. పిల్లలు మాత్రం,
ఖాళీ గోడల వెనుకాల ప్రత్యక్షమవుతున్న రూపాల్ని చూస్తూ, తమ తండ్రి
మరణిస్తే బావుండుననీ, ఎందుకంటే వాళ్ళు కూడా మరణించిన వాళ్ళకి ప్రార్ధనలు చేసి,
మరణించిన వాళ్ళు తిరిగి వచ్చి, ఇంటికి వెనుక
అంట్లు తోముకుంటున్న తమ తల్లిని మరో రాత్రిలోకి ఈడ్చుకు వెళ్లనందుకు
కృతజ్ఞతలు తెలుపవచ్చుననీ ఆశిస్తారు.

1 comment: