30 August 2010

తను

మరణించడం అంటే, జన్మించడం అంటే 

వర్షం ఒక పాపై
నవ్వుల సవ్వడితో తన వెంటబడుతుండగా, హడావిడిగా 
చెట్ల కిందుగా నడిచే వెళ్ళే 
ఆమెను గమనించడం. 

ఇక్కడ ఉంటూ మరెక్కడో జీవించడం అంటే

వర్షంలాంటి 
తన పాపను చూసుకునేందుకు జాబిలేని ఆకాశం కింద 
హడావిడిగా ఇంటికి వెళ్ళే 
ఆమెను గమనించడం

ఏమీ లేకుండా పూర్తి నిండుగా ఉండటం అంటే

చీకటి దుస్తులు 
ధరించిన దారిపై ఆమె హడావిడిగా ఇంటికి వెళ్లి, పాపకూ 
పాపగా మారిన వర్షానికీ,  వర్షంగా 
మారిన పాపకూ 

ఇంటి ఆవరణలో 
పాప మాటలతో, వర్షపు గాలులతో తడిచి తిరుగుతున్న 
పిల్లులకూ, పైనుంచి కొమ్మల మధ్యగా 
తొంగి చూస్తున్న 

చుక్కలకూ 
పాలు కాగబెట్టే ఆమెను ఊరక అలా చూస్తూ ఉండటం, 
పొయ్యి వద్ద వేడెక్కిన 
ఆమె అరచేతుల మధ్య ఊరిక అలా
పిల్లిలా ముడుచుకుని ఉండటం!

2 comments: