అప్పుడప్పుడూ పదాలు దిగంతాలకి వెళ్ళిపోతాయి
విశ్వాలకు అవతలగా
చిహ్నాలుగా, జాడలగా మారిపోతాయి. ఇక అప్పుడు
అవేమిటో నీకు తెలీదు
భూమిపై నిలబడి, వాటిపై మళ్ళా పదాలను, నీడలను
సృష్టించడం తప్పితే
వాటి వద్దకు ఎలా వేళ్ళలో ఇక నీకేమాత్రం తీలీదు.
ఇక అప్పుడు, నువ్వు
అప్పటి దాక నిర్మించుకున్న ప్రపంచం కరిగిపోతుంది
ఇక అప్పుడు, నువ్వు
అప్పటిదాకా నిర్మించుకున్న ప్రకృతి బూడిదై
నలుదిశలా వెదజల్లబడుతుంది
నువ్వ్వు తాకబోతున్న చేయి అక్కడికక్కడే తెగి
రాలిపడుతుండగా, నువ్వు స్థాణువై
నీ పాదాల చుట్టూ, నీ పదాల చుట్టూ అలుముకుని
మట్టిలోకి ఇంకుతున్న
రక్తాన్ని చూస్తావు. ఇక నువ్వు మూగావాడివీ
చెవిటివాడివీ అవుతావు.
అవిటివాడివీ అయ్యి
తెగిపడిన నీ చేతివైపు చూసుకుంటూ, నీ వద్దే ఉండి
దిగంతాలకు వెళ్ళిపోయిన
పదాలవైపు మూగాగానూ, పాదాలు లేని కళ్లతోనూ
చూస్తావు
అప్పుడప్పుడూ, అప్పుడప్పుడూ.
No comments:
Post a Comment