10 August 2010

ఎవరేనా

బాధ మధ్యలో చీకటి మధ్యలో ఎవరేనా ఒక కవిత వ్రాయగలరా

ఆహ్వానించని అతిధులు ఈ వర్షం ఈ బాధా: కలుపుతాయి తమ చేతుల్ని ఇక
ఒక మరణాన్ని ఉత్సవంలా జరుపుకునేందుకు
మరొక జీవితపు మట్టిదారిలో కోల్పోయిన జీవితాల్ని తిరిగి తెచ్చెందుకూ:

(ఎవరి మరణమో నీకు తెలుసా? నీకు తెలిసినా చెప్పకు, ఎందుకంటే
జీవించడమంటే వెడలిపోవటమే)

సూర్య కిరణాల దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆకులు
స్వేచ్చగా ఉండేందుకు విలవిలలాడుతాయి. తన కాళ్ళ మధ్య సర్పాల్లా చుట్ట
చుట్టుకుంటున్న నీడలవైపు అసహనంగా చూసే వీధి కుక్క
పిచ్చుకల గూళ్ళవంటి వేలిముద్రలను మాత్రం వొదిలి, తనను వొదిలి వెళ్ళిన
తన పాప మళ్ళా కురిసే వర్షంతోనూ, రాలే బాధతోనూ తిరిగి వస్తుందని
తన గర్భం ఒక సముద్రంలా మారేందుకు ఎదురుచూస్తున్న స్త్రీవైపు
ఓపికగా తోకూపుతూ చూస్తుంది.

(ఆ స్త్రీ ఎవరో నీకు తెలుసా? నీకు తెలిసినా చెప్పకు, ఎందుకంటే
జీవించడమంటే మళ్ళా తిరిగి రావడమే)

ఇక నీరు నీరులా ఉండటం నిలిచిపోతుంది. ఆమె ఆకుపచ్చని చిరునవ్వుని
ఒక ధార తుంపివేస్తుంది. ఒక చెట్టు తెల్లని నీడలో
ప్రజలు ఒక నిశ్శబ్దపు ఊచకూతలో గుమికూడి వాయిదా వేయబడ్డ శిక్షల్లా
జీవించే మరో రోజుకి ఎదురుచూస్తారు.
ఇక, నీరు పక్షుల కళ్ళల్లో బురదగా మారడాన్ని గమనిస్తూ ఇంటికి వెళుతున్న
పాప పారేసుకున్న పెన్సిల్ నెమ్మదిగా
విరిగిన మధుపాత్రలో వికసిస్తున్న రంగులవైపు తేలుతుంది, ఇలా అడుగుతూ:

(తిరిగి రావడమంటే జీవించడమని తెలిసిన ఎవరేనా)

బాధ మధ్యలో చీకటి మధ్యలో ఒక కవిత వ్రాయగలరా

No comments:

Post a Comment