22 August 2010

ఏది?

నువ్వు వెలిగించిన ప్రమిదె వెలుతురేనా ఇది?

నిర్మలంగా వ్యాపిస్తూ
మహా శాంతితో రాత్రిపూట సర్వత్రా కమ్ముకుంటూ
మరచివచ్చిన మరోలోకపు
మరో బ్రతుకు గీతాన్ని, మృత్యు సుగంధంతో

ఇక్కడికి లాక్కువస్తున్న ప్రేమ కాంతేనా ఇది?

ఎవరివి, ఎవరివి తండ్రీ ఆ అద్రుశ్య హస్తాలు?
ఎవరివి, ఎవరివి తండ్రీ ఆ రహస్య ముకుళిత నేత్రాలు?
ఎవరివి, ఎవరివి తండ్రీ నిన్ను
పాలిండ్ల నీడల్లో పొదివి పుచ్చుకున్న అక్షరాలూ?

ఎవరివి, ఎవరివి తల్లీ ఎవరివి, నిన్ను బాహువుల్లో
కలుపుకుని సముద్రాలై పొంగిన అశ్రువులు?
ఎవరివి మిత్రుడా ఎవరివి, నీవే అయ్యి
శిలువ వేయబడి మరణించి, పునర్జన్మించి
నిన్ను వేటాడే ప్రార్థనా గీతాలు?

నువ్వు వెలిగించీ, సర్వశక్తులూ ఒడ్డి, అర్థాంతరంగా
ఆర్పివేద్దామనుకున్న కాంతి ఏ అస్తిత్వానిది?
నువ్వు వెలిగించి వెడలిపోయిన, ముడుచుకుపోయి
రాలిపోతున్న దీపపుష్పపు కాంతి
ఏ అవ్యక్త మట్టి దు:ఖపు స్వరానిది?

నీ ముఖం ఆమె అరచేతుల మధ్య పసిపాప ముఖమై
వికసించినప్పుడూ
నీ పాదాల, శబ్దాల సంగర్షణ అంతా
ఆమె కళ్ళల్లో నీటి తామరల లతల్లా అల్లుకుపోయి
అందరి శరీరాల్ని పెనవేసుకున్నప్పుడూ
ఒక నక్షత్రం, ఒకే ఒక్క నక్షత్రం, ఎవరూ లేక
తడి ఆరిన భూమిపై
శిధిలాలలోంచి పొడుచుకు వచ్చిన నీ నాలికపై
మంచు బిందువై రాలినప్పుడూ
భాష ఏది? సత్యమేది? స్థాన్యమేది? నువ్వు జన్మించిన
పురాకాంతి మృత్యుస్కలన రక్త మందిరమేది?

No comments:

Post a Comment