14 August 2010

mea culpa

ఇది నా తప్పిదమే: నేను ఇంకా స్నేహితుల కోసం సోదరులలలోనో, వేశ్యా గృహాలలలోనో కాంతి వేగంతో వెడలిపోయే ప్రతీకలలోనో, హృదయంలో ఓ మంచం, చేతుల్లో ఓ అమృత పాత్ర - అల కదులాడే ఓ స్త్రీలోనో ఒక దయాపూరితమైన పదాన్ని దగ్గరుంచుకుని తిరుగాడే మనిషిలోనో, నేను ఇంకా స్నేహితుల కోసం వెదకడం ... ఇది నా తప్పిదమే!

ఓ సుదీర్ఘమైన మధ్యాహ్నం తరువాత తల్లి లేని ఇళ్ళకు తిరిగి వెళ్ళే పిల్లల సాయంత్రాల తరువాత, నాకు నేనే ఓ మిత్రుడిగానూ ఓ శత్రువుగానూ మారిపోతాను. పిగిలిపోయి నలుదిశలా కొట్టుకు వెళ్లిపోతాను ....

గాయపడి, ప్రేమించిన వాళ్ళచే నరకబడి, పేగుల్ని అరచేతిలో పొదివి పుచ్చుకుని, నీ చూపు దిగబడి కోల్పోయిన కన్నులతోటి ఇక నేను ఒక ధనుస్సుని అందుకుని నా నుదిటి మధ్యగా ఒక బాణాన్ని సంధించుకుంటాను

నిన్ను ప్రేమించినందుకు నన్ను ప్రేమించుకున్నందుకూ నా చుట్టూ ఉన్న సర్వాన్నీ ప్రేమించినందుకూ: mea culpa.

2 comments:

  1. శ్రీకాంత్, అద్భుతం అనేది ఎంత డొల్ల మాట. పద్యం చదవగానే ఆ మాట తట్టినందుకు నన్ను నేను తిట్టుకున్నాను. మనస్సుతో బంతాట ఆడావు. నా ప్రేమ కొంచెం తీసుకో. మియా కల్పా అంటే నిఘంటువు చూశాను. తెలుగు మాటే వాడొచ్చుగా?!

    ReplyDelete