31 August 2010

ప్రతి రోజూ మనం

ప్రతిరోజూ మనం ఎవరినో ఒకరిని మనవెంట తీసుకువెళ్ళాలి
కొన్నిసార్లు అది అలసిన ఒక స్త్రీ కావొచ్చు, మరి
కొన్నిసార్లు అది అలసటలేని వర్షం కావొచ్చు

కొన్నిసార్లు మనం ఒక పిల్లవాడి చేయి పుచ్చుకుని అతడిని
రహదారిని దాటించాలి, మరి
కొన్నిసార్లు మనం రాత్రి అతడి పక్కగా పడుకుని కథలు చెప్పాలి,ఇంకా
కొన్నిసార్లు జ్వలించే అరణ్యంలా మారిన అతడి నుదిటిపై
ఒక తడిరుమాలు తుంపరను కప్పుతూ, జ్వరానికి ఒక చెంచాడు
మందు తాగమని బుజ్జగించాలి

కొన్నిసార్లు మనం వృద్దులగా మారుతున్న వాళ్ళను దగ్గరికి తీసుకుని
వాళ్ళు ఇంతకు మునుపు చూసినవన్నీ
మళ్ళా మరొకసారి ఒక కొత్త చంద్రకాంతిలో చూపించాలి. మరి
కొన్నిసార్లు మనం మనల్ని పొదివి పుచ్చుకుని, ఆకాశంనుంచి
భూమికి ఒక ఊయలను కట్టి నిర్భయంగా ఊగుతూ, తూగుతూ
వెలుగూ నీడల సమ్మేళనంలో రంగులు మారుతున్న, పదాలు లేని
పూల భాషనీ, పదాలు ఉన్న నత్తి భాషనీ మరొకసారి వినాలి.

ప్రతిరోజూ మనం కుంటుతున్న సమయాన్నీ, స్పృహ తప్పేంత ఉద్విగ్నతతో
మనల్ని ముంచివేసే మనవి కాని తపనలనీ
శిశువుని భుజాన ఉన్న ఒక జోలెలో మోసుకువెళ్ళే స్త్రీవలే తీసుకువెళ్ళాలి
ప్రతిరోజూ మనం. ప్రతి రోజూ మనం.

1 comment: