19 August 2010

సాధ్యం

కూర్చో, కొద్దిసేపు అలా విరామంగా
ప్రేమమయపు అలసటతో ఆగిన వర్షాకాలపు తెమ్మెరలా
కొద్దిసేపు అలా, ఊపిరిపోసుకుంటున్న కలలా
ప్రశాంతతతో, నీతో నువ్వు కూర్చో: ఏమీ ఆలోచించకు
పక్షిలా, అన్నిటినీ వోదిలివేసి
నీ రెక్కల్ని విదుల్చు. నీ చుట్టూ ఉన్న కాంతినీ, చీకటినీ
ఆ ప్రమిదెపు ఆఖరి చూపునీ
నీ అస్తిత్వపు నాలికతో చప్పరించు. నీకు తెలుసు
ఈ జీవితంలో జీవించేందుకు, నువ్వు
మరణించేముందు మరణించాలి. ఆ తరువాత
అన్నీ సాధ్యం అవుతాయి. నక్షత్రాలూ
పాలపొదుగులాంటి వెన్నెలా, దయగా నవ్వే సూర్యుడూ
వర్షం, హర్షం, ప్రతిధ్వనిస్తున్న
శిశువు నవ్వులాంటి నువ్వూ, నీ ఆఖరి మొదటి అస్థిత్వమూ
అన్నీ సాధ్యం అవుతాయి.

No comments:

Post a Comment