07 August 2010

చాలు

మరొక్కసారి జీవించేందుకు మరొక్కసారి మరణించేందుకు ఆ శిశువు తాకిన ప్రదేశం చాలు. మరొక్కసారి ప్రేమించేందుకు మరొక్కసారి ద్వేషించేందుకు ఆ స్త్రీతో గడిపిన ఏమీ లేని సమయాలు చాలు. విలవిలలాడుతున్న మనుషులతో స్పృహ తప్పిన ఈ దారిని దాటేందుకు వేసవి ఇసుకలో గెంతుతున్న పిల్లల ఇకిలింతలు చాలు. దు:ఖితులైన స్నేహితులతో దు:ఖిస్తూ ప్రయాణించేందుకు మధువుతో వివశితమైన అంతం కాని రాత్రుళ్ళు చాలు. ఋతువుల పాటలను సముద్రపు చీకట్లో నిస్సంకోచంగా పాడేందుకు నిశబ్దంగా ముసలివాళ్ళు అవుతున్న నా తల్లి తండ్రుల ఓరిమి చాలు. నిశబ్దంగా మరోరోజు ముందుకు సాగేందుకూ ఆరోపణలు లేకుండా మరో రాత్రి ఇంటికి వెళ్లేందుకూ ఆవరణలో పిల్లి పిల్లలతో ఆడుకుంటున్న వేపాకుల నీడలు చాలు. అంతిమంగా భూమిపట్ల కృతజ్ఞతతో ఈ మట్టిలో కలిసిపోయేందుకు ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం బ్రతికి ఉన్నాననే స్పృహ చాలు. మరొక్కసారి మరొక జన్మలేని మృత్యువుని హత్తుకునేందుకు ఈ పదాలన్నిటినీ రాసుకునేందుకు ఉంచుకున్న ఈ తెల్లటి కాగితం తప్పక చాలు

No comments:

Post a Comment