మరణానికి ముందు
రెండు చేతుల్నీ ముఖంపై కప్పుకుని అతడు రోదించాడు.
అంతిమ ఘడియలలో
మరణం, మనం అమితంగా ప్రేమించేవాళ్ళ రూపంలో దర్శనమిస్తుందట: నీవు లేవు కానీ
నీ తండ్రి తన జీవితంలో ఎప్పుడూ రోదించలేదు, ఒక్క మరణానికి ముందు తప్ప:
అలా అని వాళ్ళు అన్నారు.
అతడి మరణానికీ
అతడి ఖననానికీ, అతడి మొదటాఖరి రోదనకీ నేను లేను. రెండు మేఘాల మధ్య
సంచరిస్తున్న సూర్యరశ్మిలా
అరచేతుల మధ్య పొదుగుతున్న కళ్ళతో, కన్నీటి అద్దంలో
ప్రతిబింబించిన, అమితంగా ప్రేమించిన, చివరి రూపం ఎవరిది?
తల్లులు తనయుల వద్ద రోదిస్తారు. మరి తనయులు ఎవరి వద్ద రోదిస్తారు?)
***
నాలుగు గోడల మధ్య నేను
నా భార్యతో గొడవ పడ్డాను. పగిలిన అద్దం
విరిగిన గాజులు, అరచేతులపై
పెదాలు ఆన్చబోయి ఆగిపోయిన పాప
చేతి వెళ్ళు ఆమె కళ్ళు.
మొండి గోడలు ఇక శిలువ వేయబడిన ఆమె
నాలిక రక్తంతో తడుస్తాయి.
***
సమాధిపై
నెమ్మదిగా పరుచుకుంటున్న చీకటిలో
మొలకెత్తిన చిరుమొక్కని
ఎవరి కనులు పలుకరిస్తాయి?
ప్రేమ అమితంగా ప్రేమించేవాళ్ళతోనే
మరణిస్తుందట: నువ్వు లేవు కానీ
జీవితంలో నేను ఎప్పుడూ రోదించలేదు ఒక్క నిన్ను ప్రేమించిన తరువాత తప్ప:
అలా అని ఆమె అంది.
***
చెప్పని నిశ్శబ్దం ఒకటి ఉంటుంది
తాకని సముద్రం ఒకటి ఉంటుంది
కురవని నయనం ఒకటి ఉంటుంది
భర్తను స్పర్సించని భార్య చేయి ఎప్పుడూ ఒకటి ఉంటూనే ఉంటుంది. తండ్రిని తాకలేని
తనయుడి నిస్సహాయత ఎప్పుడూ ఒకటి ఉంటూనే ఉంటుంది. కానీ
వృక్షాలకు ఆవలగా మేఘాలు లేకుండా నిరంతరం కురిసే వర్షాన్ని ఎవరి కనులు చూస్తాయి?
(భార్యలు భర్తల వద్ద రోదిస్తారు, మరి భర్తలు ఎవరి వద్ద రోదిస్తారు?)
***
తెల్లవారుజామున, ఇంటి బయట
అతడు తన మొదటి ప్రియురాలు అయిన మాజీ భార్యతో గొడవ పడ్డాదు.
ఉచితంగా వచ్చే ప్రదర్సన అని
చూసేందుకు పదిమందీ ఎగబడ్డారు:
అతడు మౌనంగా నిలబడి చూస్తుండగా, ఆమె వెక్కిళ్ళు పెడుతుంది
అతడు మౌనంగా కదిలి గదిలోకి వెల్లిపోతుండగా, ఆమె అక్కడే
కూర్చుని రోదిస్తుంది: తెల్లవారుజామున పదిమందీ
పాలుపంచుకునే ఉచిత జాతర కనుక, ఆమె రోదిస్తూనే ఉంటుంది
ఇక రాబోయే సమయమంతా కళ్ళపై ముళ్ళ కిరీటాలతో
చెవులలో శిలువలని మోసుకుంటూ గడపాలి.
***
ప్రతి ఒక్కడి దు:ఖం
మరొకడు పగలంతా ఎదురుచూసే
వినోదాత్మక కార్యక్రమం.
సమాధిలో
చీకటిలో మొలకెత్తి పుష్పించి చీకటిలోనే
రాలిపోయిన మొక్కను అమావాస్యనాడు
ఏ చేతులు తాకుతాయి?
మరణం అమితంగా ప్రేమించే వాళ్ళతోనే మొదలవుతుందట.
నువ్వు లేవు కానీ
నేను ఎప్పుడూ మరణించలేదు, ఒక్క ప్రేమించిన తరువాత తప్ప: అలా అని
అతడు చెప్పలేదు
చివరి చూపు దక్కిందా అని ఆమే అడగలేదు.
***
చూడని సత్యం ఎప్పుడూ ఒకటి ఉంటూనే ఉంటుంది
వినని గీతం ఎప్పుడూ ఒకటి ఉంటూనే ఉంటుంది
పీల్చని గాలి ఎప్పుడూ ఒకటి ఉంటూనే ఉంటుంది
అతడిలోని మరో ప్రపంచం చూడని ఆమే, తనయుడిని ప్రేమించలేని తండ్రి ప్రేమా
ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ
భూమికి అవతలగా మేఘాలకు అవతలగా పగటి పూట నిరతరం ప్రకాశించే
జాబిలిని ఎవరి ఓదార్పులు అందుకుంటాయి?
(ప్రియురాళ్ళు ప్రియుల వద్ద రోదిస్తారు, మరి ప్రియుళ్ళు ఎవరి వద్ద రోదిస్తారు?)
***
మరణానికి ముందు
రెండు చేతుల్నీ ముఖంపై కప్పుకుని అతడు రోదించాడు.
అంతిమ ఘడియలలో
మరణం, అమితంగా కోల్పోయిన వాళ్ళ రూపంలోనే దర్శనమిస్తుందట. నువ్వు లేవు కానీ
నీ తండ్రి తన జీవితంలో ఎప్పుడూ రోదించలేదు, ఒక్క మరణానికి ముందు తప్ప:
అలా అని వాళ్ళు అన్నారు.
రెండు వృక్షాల మధ్య సంచరిస్తున్న
సీతాకోకచిలుకల్లా, అరచేతుల మధ్య పిగులుతున్న కళ్ళలో, కన్నీటి తటాకంలో
కన్నీటి బొట్టులా, వీడ్కోలు చిరునవ్వులా కదులాడిన, అమితంగా కోల్పోయిన రూపం ఎవరిది>
(తల్లులు తండ్రుల వద్ద రోదిస్తారు, మరి తండ్రులు ఎవరివద్ద రోదిస్తారు?)
*
No comments:
Post a Comment