08 August 2010

అతడు

పరచితమైన అతడి దు:ఖానికి ఎటువంటి ఉపోద్గాథమూ అవసరనం లేదు

సంధ్యాకాశపు స్త్రీ తన తన శిరోజాల్ని వొదులు చేసుకుని, జడలోని రాత్ర్రి గులాబీని
ఎదురు చూస్తున్న బిక్షగత్తె అరచేతుల మధ్యకు వొదులుతుండగా అతడు ఒంటరిగా
రహదారులపై నడుస్తాడు

సుపరచితమైన అతడి ఏకాకితనానికి ఎటువంటి ఉపోద్గాథమూ అవసరనం లేదు

వేసే ప్రతి అడుగులో అతడు రాలిపోతున్న ఆకుల్ని లెక్కపెడతాడు. వేసే ప్రతి అడుగులో
అతడు పేరుకుంటున్న గాయాల్ని గమనిస్తాడు. వేసే ప్రతి అడుగులో అతడు
మరణించేముందు, పూలతో, జ్ఞాపకాలతో కన్నీళ్ళతో తనని అల్లుకున్న ఆ స్త్రీ దిగులు
ముఖాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ తరువాత

సాయంవేళ, పనివాళ్ళు గోడలకు ఆనుకుని మాటలతో సేదతీరుతున్న వేళ, ఎరుకతో
కదులాడే భూమి వాసనను స్త్రీలు పీలుస్తున్న వేళ, అలసిన లోకంలో మనుషులు
సొలసిన హృదయాలతో గూళ్ళకు చేరుకుంటున్న వేళ అతడు చాతిని కోసుకుని తన
రక్తాన్ని మధువుతోనూ హింసతోనూ తాగుతాడు.

అన్నింటినీ బూస్థాపితం చేసే పరచితమైన అతడి పదాల సమాధులకి ఎటువంటి
ఉపోద్గాథమూ అవసరనం లేదు

కలగా పులగామైన ప్రతీకలతో తడబడుతూ అతడు రాత్రిలోకి కదిలినప్పుడు ఒక కవిత
తన పాదంతో అతడి పెదాల చివర్న చిగురిస్తున్న వాక్యాన్ని చీలుస్తుంది

ఈ ప్రపంచంలోని సామజిక మనుషుల్లారా, అతడు ఈ ప్రపంచానికి బయటివాడు, అతడు
ఈ ప్రపంచంలో అనాధ. ఈ చీకటి సమయం ఆకాశానికి ఉరివేసుకుని జాబిలి
రక్తాన్ని కక్కక మునుపు, పరచితమైన అతడి మృత్యు అనుభూతికి ఎటువంటి
ఉపోద్గాథమూ అవసరనం లేదు

No comments:

Post a Comment