నేను నిన్ను కలిసేందుకు ఎందుకు వస్తానో నీకు తెలుసా?
నాకు తెలియదు, కానీ నేను నీకు ఈ విషయాన్ని చెబుతాను.
నేను ఎలా ఉండేవాడినో ఎలా ఉన్నానో
ఎలా ఉండబోతున్నానో చెబుతాను.
రాత్రి ఒక పిచ్చివాడి చేతులోంచి విసిరివేయబడ్డ రాయిలా
నా వైపు దూసుకు వస్తున్నప్పుడు
నేను బ్రతికి ఉండగానే పాతిపెట్టబడ్డ ఒక మనిషి సమాధిని
మోసుకు తిరుగుతున్నాను.
నా బిడ్డ ఆ సమాధిలో ఒక విత్తనాన్ని నాటి, ఒక మొక్క
మొలకెత్తటంకై ఎదురు చూస్తున్నాడు.
అంతాడు ఒక మొగ్గ వికసించేందుకై ఎదురు చూస్తున్నాడు.
ఈలోగా పైన ఆకాశంలో ముదురు మబ్బులు కమ్ముకుంటాయి.
అవి, నిరంతరంగా ఎదురుచూసే వర్షించబోయే ఆ స్త్రీ నయనాలు.
ఈలోగా సుదూరంలో ఒక తల్లి ప్రార్ధిస్తూ ఉండగా
ఒక శిశువు అప్పుడే మొలకెత్తిన మొక్కవైపు, పాలలో మూత్రంలో
మునిగిన భాషతో అంబాడతాడు .
జీవించి ఉండగానే సమాధి చేయబడ్డ వారెవరో నాకు తెలియదు
స్నేహితులు లేక తిరుగాడే వారెవరో నాకు తెలియదు
కానీ నేను నీకు ఇది చెబుతాను,
నేను వివశితుడనై ఉన్నాను, వివశితుడనై ఉంటాను వివశితుడనై
ఈ లోకం నుంచి వెడలిపోతాను.
కోల్పోయిన ఒక జీవితపు శేష ప్రభావాన్ని మోసుకు తిరుగుతున్నాను
ఒక రాత్రి మరొక రాత్రిని పుచ్చుకుని
ఇంకొక రాత్రిలోకి తోడుకుని వెడుతుండగా, రహదారులన్నీ
తాగుబోతులతో, వేశ్యలతో, పిల్లలతో, పూవులతో, స్త్రీలతో
గాలిలో గీతాలు ఆలపించే పక్షులతో, భూమి సువాసనతో, పూర్వీకుల
రక్తంతో నిండి ఉన్న ఒక అతిధి గృహానికి దారి చూపుతాయి.
No comments:
Post a Comment