30 August 2010

ఈ వేళ

దయచేసి ఇక్కడి రా, దాచుకునేందుకు ఏమీ లేదిక్కడ

ఆఖరకు నేను ఈ వేళ
నా రహస్య అస్తిత్వపు దిగులు దీపాలనూ బహిర్గతం చేసాను
ఆఖరకు నేను ఈ వేళ
ఒక పసిపాపను నా కనుల ఇసుక మైదానాలపై ఆడనిచ్చాను
ఇంకా ఏమిటంటే ఈ వేళ, ఈ రాత్రి
నా తల్లి మరోమారు తన పెదాలపై తార్లాటలాడుతున్న తెల్లటి
పిచ్చుకల్తో కలగలసి నవ్వుతుంది
ఆమె నుదిటిపై ఒక పచ్చటి అరణ్యం వికసించటం మొదలయ్యింది

దయచేసి ఇక్కడి రా, దాచుకునేందుకు ఏమీ లేదిక్కడ

కొంత వర్షం ఎప్పటికైనా ఎప్పుడైనా ఆహ్వానితమే, ఇక నేను ఈ వేళ
పూర్తిగా తడచిపోయేoదుకైనా సిద్ధమే
రానివ్వు, కొంత నొప్పినైనా మరికొంత వేదనైనా, భరించలేనంత దు:ఖానైనా
ఇక నేను ఈ వేళ నగ్నంగా
పూర్తిగా పిగిలిపోయెందుకైనా సిద్ధంగా ఉన్నాను. నేను ఈ వేళ
కనులను కోల్పోయి ఉన్నాను
నీ రక్తానికై, నీ వక్షోజాలకై, కూరగాయలతో పచ్చిచేపలతో పరిమళించే,
కడగని నీ జుత్తుకై నేను దాహార్తినై ఉన్నాను

దయచేసి ఇక్కడి రా, పొదుపు చేసుకునేందుకు ఏమీ లేదిక్కడ, అందుకని

ఇక ఈ వేళ, ఇక్కడ కొంత హింస ఉండనీ, కొంత మత్తు ఉండనీ
కొంత క్రమశిక్షణారాహిత్యం
కొంత అక్రమం కొంత నువ్వు కలగలసిన ద్వేషపు దయా ఉండనీ. నీ స్వరం
కనిపించని ప్రేమ ఆస్థిపంజరాలను పిలుస్తుండగా
ఇక ఈ వేళ, ఇక్కడ కొంత ఉన్మాదం ఉండనీ, కొంత దిగులు ఉండనీ
కొంత మొద్దుబారుతున్న నిదురలేనితనం
నా పాదాల కింద మట్టిని అనుక్షణం అనుభూతి చెందే కొంత మృత్యువూ ఉండనీ
కొంత వర్షంతో, మొండి చేతులతో
తలస్నానం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆ అమ్మాయి పదాలతో, ఉచ్చరించలేని
దైవ భాషతో, ఈ వేళ ఇక్కడ నన్ను ఉండనీ.

No comments:

Post a Comment