21 August 2010

జాడ

నీ ఊపిరికి నీ వద్దకు వస్తాను నేను-

నీవు లేనితనంలో నీ ఉనికిని వింటాను నేను. ఎవరో వొదిలి వెళ్ళిన
గులాబి నీడ గులాబీని వింటున్నట్టు
నీవు లేనితనంలో నీ ఉనికి నిశ్శబ్దాన్ని వింటాను నేను

నీ ఊపిరికి నా వద్దకు వస్తాను నేను

పదాల నీడలలో, ఎవరూ తాకని, నీ శాశ్వతమైన తాత్కాలికపు
మరణపు పెదాలను రుచి చూస్తాను నేను
విరిగిన శిలావిగ్రహాలు ప్రాణం పోసుకుని, చీకటిపూట
ఈదురుగాలుల వంటి ఊపిరులతో
ఒంటరి నక్షత్రం వైపు తపనగా చేతులు చాచినట్టు, నీలోని
తడిని తదేకంగా చూస్తాను నేను

నీ ఊపిరికి ఈ ప్రపంచం నుంచి వెడలిపోతాను నేను

ఖాళీ గూళ్ళలో ఒదిగిఉన్న అంతిమమైన అసంపూర్ణ అర్థంలాంటి
నీ సారాంశాన్నీ, సత్యాన్నీ
నీవు లేని చోట మాత్రమే కనుక్కుంటాను నేను. గాలిపై గాలి
నీడపై నీడ
జాడపై జాడ
సర్వత్రా వ్యాపించి మరణంతో జన్మిస్తున్న భాష. చూడు

నీ ఊపిరికి నీ వద్దకు వస్తాను నేను.

No comments:

Post a Comment