21 August 2010

ఇది

ఎవరూ తాకక నిశ్చలంగా నిలబడి ఉన్న ఈ ముళ్ళు
నీ ఆప్త మిత్రురాలు
సంధ్యాస్తమైన వింత సమయాన
పసిపాప కన్నుకంటే సున్నితమైన లేత ముళ్ళు ముందు
మోకరిల్లి ప్రార్దిస్తావు:
"రాత్రిపూట మసక వెన్నెల్లో చలించే
దేవతవి నీవు
నీ సరళమైన ఉనికి వల్లనే
విచ్చుకునే పూవుల వివిధ రంగులు సాధ్యమయినాయి
నీవున్నావు కనుకనే
నా పాదాల వెంట సాగే నా తల్లితండ్రుల నీడలు
ఊపిరి పీలుస్తాయి
నాకు ఇది చెప్పు
నేను నీలా మారటం ఎలాగో?

జవాబు:

"నీవు పూర్తిగా ఖాళీ అయినప్పుడు మాత్రమే
నిండుగా ఉంటావు-
ఈ శూన్యపు పుష్పాన్ని, నిండైన నీ స్త్రీకి
బహుమతిగా ఇవ్వు. ఆ తరువాత
నీకే దయగా తెలుస్తుంది
స్త్రీలూ పుష్పాలూ ఒకటేనని. పుష్పాలూ
ముళ్ళూ ఒకటేనని. శూన్యం
శూన్యారాహిత్యమూ మృత్యుపక్షి విదిల్చే
రెండు అనంతపు రెక్కలని.
నిశ్చింతగా గాలిలో తెలు, గిరికీలు కొడుతూ
నేలపై వాలి నాట్యమాడు
నీటిని స్పృశించు, గాలిని పరామార్సించు
నీలోపల నీవు విశ్రమించు-
ఇది జీవితం, ఇది జీవించడం
ముళ్ళులా ఉండటమంటే ఇది:
నీవు పూర్తిగా ఖాళీ అయినప్పుడు మాత్రమే
నిండుగా ఉంటావు-"

No comments:

Post a Comment