14 August 2010

అర్ధాంతరంగా

ప్రతి రాత్రీ ఏదో ఒకటి వెన్నంటే వస్తుంది. ప్రతి క్షణాన్నీ ఏదో ఒకటి వేటాడుతూనే ఉంటుంది: కానీ నిన్ను నిలువునా చీల్చివేసేదీ నీ అంతరాలలో, నీకు మాత్రమే తెలిసిన నీవైన కాంతికిరణాల వేర్లనీ తడిపివేసేదీ, మృతుల కలలలో పునరావృతమవుతూ ఆకాశాలలో 

నిర్భీతిగా ఎగురుతూ, నువ్వు మరచి వచ్చిన నీ రహస్య కలల నువ్వు ఒకప్పుడు జీవించిన ప్రదేశాల్ని ఒక కేకతో గుర్తుకుతెచ్చే డేగల్ని మైమరుపు విరామంలో గతమూ భవిష్యత్తూ లేని ఒక ఇప్పటి సమయంలో నింపి వేసేది ఏమిటి?

ఏమిటది? నిన్ను కృష్ణ బిలాలలోకి సుదూర నక్షత్రాలలోకీ, తడబడిన ఇతరుల కనులలోకీ ప్రతిసారీ నీలో అస్తవ్యస్తంగా అల్లుకుంటున్న పదాలలోకీ, ఒక సంజ్ఞగా ఒక శిక్షగా పరావర్తనం చెందుతున్న స్త్రీలలోకీ నిన్ను నిర్ధయగా నెట్టివేసి నీలోనే ఉంటూ నిన్ను నిర్లిప్తంగా గమనించే

సర్వవ్యాప్తమైన ఆ ఉనికి ఏమిటి? ఇక ఇదంతా అయిన తరువాత, ఇక ఇదంతా పలికిన తరువాత ఇక వ్రాయటానికే ఏమైనా మిగిలి ఉంటే, అది నీ శరీరపు చీకటి గుహలో ఇంకా మిగిలి ఉన్న, నిన్ను ముంచివేసిన నీ కలల గర్భస్రావపు శిశువు!

No comments:

Post a Comment