09 August 2010

ముగ్గురు స్త్రీలు

ముగ్గురు స్త్రీలు నా ముందు కూర్చున్నారు
మూడు యుగాలకి చెందిన మూడు పురాణాల్లా: ఒక విధవ, ఒక భార్యా ఒక కూతురు.
***
సీతకు రాముడు ఎమౌతాడు?
***
అమ్మమ్మ కూర్చుని చూస్తుంది
మంచంపై మరణిస్తున్న కొడుకుని-
కొడుకు భార్య లేచిపోయి చాలా కాలమయ్యింది
భార్య కూతురు లేచిపోయి
ఒక యుగం అయ్యింది:
స్త్రీలకే ఇల్లుండవు
స్త్రీలకే స్థల కాలాలు ఉండవు: అందుకే
ఈ ప్రపంచం దాచిన తమ ప్రపంచాల్ని వెదుక్కుంటారు
మరణించిన పురుషులందరూ తరిగి రాగా
జీవిస్తున్న స్త్రీలందరూ ధరిత్రిలోకి అద్రుశ్యమవుతారు
పుణ్య స్త్రీ సీతని కొందరంటారు
ఆత్మహత్యని మరి కొందరంటారు. అయితే
సీతకు రాముడు ఎమౌతాడు?
***
అమ్మ కూర్చుని చూస్తుంది
మంచంపై మరనిన్చాబోయే అమ్మమ్మని
అమ్మమ్మ భర్త చనిపోయి చాలా కాలమయ్యింది
భర్త కొడుకులు ఇల్లు వొదిలి
ఒక యుగంయ్యింది
స్త్రీలకే గదులుండవు
స్త్రీలకే స్థల కాలాలు ఉండవు: అందుకే
ఈ ప్రపంచం దోచిన తమ ప్రపంచాల్ని వెదుక్కుంటారు
పురుషులంతా యుగ పురుషులు అవుతుండగా
ప్రేమిస్తున్న స్త్రీలందరూ నాశికలను కోల్పోతారు
కులట స్త్రీ శూర్పనఖ అని కొందరంటారు
తెల్లటి ప్రేమ అని మరి కొందరంటారు. అయితే
సీతకు రాముడు ఎమౌతాడు?
***
కూతురు కుర్చుని చూస్తుంది
మంచంపై మరణానికి ఎదురుచూస్తున్న అమ్మని
అమ్మ సమయాన్ని కోల్పోయి చాలా కాలమయ్యింది
భర్తలుగా మారని కొడుకులు ఇల్లు వొదిలి
ఒక యుగంయ్యింది.
స్త్రీలకే పడకలుండవు
స్త్రీలకే పడుకునేందుకు చోటు ఉండదు: అందుకే
ఈ ప్రపంచం చూడని చోట తమ పదాల్ని వెదుక్కుంటారు
యుగకర్తలందరూ నీతి సంస్కర్తలవుతుండగా
వేచి చూసే స్త్రీలందరూ తమ మేలుకువని కోల్పోతారు
సహనశీలి సాధ్వి ఊర్మిళ అని కొందరంటారు
పద్నాలుగేళ్ళ వేసిన తలుపుల వెనుక కలలు లేని నిద్రని
మరి కొందరంటారు. అయితే
సీతకు రాముడు ఎమౌతాడు?
***
పాదాచారిణిలు స్త్రీలు
పదాలను సృష్టించుకుంటారు పాదాలతో
దారుల్ని ప్రతిష్టించుకుంటారు తమ గర్భాలలో - అందుకే
నా ముందు
మూడు యుగాలకు చెందిన ముప్పై యుద్దాల్లా కూర్చున్న స్త్రీలు
తమ గర్భాలతో సీత చెంతకు చేరుతారు
తనకు రాముడు ఎమౌతాడో చెప్పమని:
*

No comments:

Post a Comment